తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు
Publish Date:Mar 29, 2025

Advertisement
అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది. ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు వారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం చరిత్ర సృష్టించింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎగతాళి మాటలకు ఎన్టీఆర్ గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని తొలిసారే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి చరిత్ర సృష్టించింది. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ హవా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేదవాడి కడుపు నింపుతూ.. అన్ని పార్టీలకూ ఆదర్శ మైంది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపి, మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాజకీయ ఓనమాలు తెలియని వారిని లీడర్లుగా తయారు చేసి పొలిటికల్ యూనివర్సిటీగా పేరు గాంచింది.
పేద ప్రజల గుండెలలో ఛిర స్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజ పరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ, యుగపురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది ఆయనకు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఇందిరాగాంధీ సాయంతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగోడి ఆవేశాన్ని, చైతన్యాన్ని యావత్తు ప్రపంచం చూసింది. అప్పట్లో పార్టీ నేతలను సమన్వయపరుస్తూ, ప్రజాందోళనలతో కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చిన చంద్రబాబునాయుడు తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కి పైగా స్థానాలతో ఎన్టీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించడంలో సీబీఎన్ కీరోల్ పోషించారు.
1994లో టీడీపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి పెత్తనం కారణంగా పార్టీలో ఎన్టీఆర్ శకం ముగిసి, చంద్రబాబు మార్క్ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం వీపీ సింగ్‌ను ప్రధానిని చేసి కాంగ్రెస్ ఆధిపత్యానకి గండి కొట్టగలిగింది. 1998లో టీడీపీ హయాంలో చంద్రబాబు విజన్‌తో సాంకేతికత పరుగు పెట్టడం ప్రారంభించి, సైబర్ టవర్స్‌తో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. 1999లో టీడీపీ నాలుగోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హైటెక్ స్పీడ్‌తో అభివృద్ధి పరుగులు పెట్టి, చంద్రబాబుకి హైటెక్ సీఎం బ్రాండ్ ఇమేజ్ సాధించిపెట్టింది.
తర్వాత పదేళ్లు టీడీపీ అధికారానికి దూరమవ్వడం, రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబు రెండు ప్రాంతాలు ముఖ్యమేనంటూ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకోవడంతో తెలుగుదేశం పనైపోయిందని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. అయితే రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కాముకుడు, హైటెక్ దార్శనికుడు చంద్రబాబునే నెత్తినపెట్టుకుని, 2014లో తెలుగదేశానికే అయిదో సారి పట్టం కట్టారు. అటు తెలంగాణలోనూ రాష్ట్ర విభజన తర్వాత 12 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం గెలుచుకున్న టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ప్రస్తుతం ఏపీలో ఆరో సారి రికార్డు మెజార్టీతో గెలిచిన టీడీపీ నుంచి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ , అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీరోల్ పోషిస్తూ తెలుగువాడి ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు.
మొత్తం 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చి, కేవలం నాలుగు సార్లు మాత్రమే అధికారానికి దూరమైందంటే ఆ పార్టీ ప్రజల మనస్సుల్లో ఎంతగా పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు రెండు తెలుగురాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొని, జై ఎన్టీఆర్, జైజై చంద్రబాబు అన్న నినాదాలు హోరెత్తాయి.
http://www.teluguone.com/news/content/43-years-of-tdp-39-195246.html












