కర్నాటక కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు!?
Publish Date:Jan 12, 2025
Advertisement
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయా? ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులా తయారైందా? పైకి సయోధ్యగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. ఇరువురి మధ్యా విభేదాల కారణంగా పాలన సజావుగా సాగడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. వాస్తవానికి కర్నాటక కాంగ్రెస్ లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు కొత్తగా వచ్చినమేమీ కావు.
వాస్తవానికి 2023 మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి తీవ్ర పోటీ జరిగింది. అధిష్ఠానం జోక్యంతో శివకుమార్ అతి కష్టం మీద ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని అన్ని విధాలుగా ఆదుకుని అండగా నిలబడిన డీకే శివకుమార్ నే అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందని అంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో సిద్ధరామయ్యకు ఆ అవకాశం దక్కింది. అప్పట్లోనే రొటేషన్ పద్ధతిలో సీఎం సీట్ షేరింగ్ అన్న ప్రతిపాదనను అధిష్ఠానం ఇరువురి ముందూ ఉంచిందనీ, అందుకు ఇరువురినీ ఒప్పించిందనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య, ఆ తరువాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉంటారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఒప్పందం గురించి బాహాటంగా ప్రకటించలేదు.
ఇప్పుడు సిద్దరామయ్య గడువు ముగుస్తుండటంతో డీకేకు సీఎం పదవి అన్న అంశం తెరమీదకు ప్రముఖంగా వచ్చింది. అయితే ఈ విషయంలో ఇటు సిద్దరామయ్య కానీ, డీకే శివకుమార్ కానీ పెదవి విప్పడం లేదు. వారి వారి మద్దతు దారులు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటనలు చేస్తూ విభేదాలను రచ్చకీడుస్తున్నారు. ప్రధానంగా ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య ఇరుక్కోవడంతో అధిష్టానం ఆయనను తప్పిస్తుందనీ డీకే సీఎం అవుతారనీ ఆయన మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. హైకమాండ్ ఈ విషయంలో ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ డీకే మద్దతుదారులు మాత్రం పదేపదే తమ నాయకుడికి సీఎం పదవి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకే.. అటువంటి ప్రకటనలు వద్దంటూ తన మద్దతుదారులను వారించారు. తానైనా, సీఎం సిద్దరామయ్య అయినా అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామన్నారు. ఆయన వ్యాఖ్యలతో డీకే అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అధిష్ఠానం సిద్దరామయ్యను తప్పించి డీకేకు సీఎం పదవి కట్టబెడుతుందనీ, డీకే మాటల వెనుక ఉన్న అర్ధం అదేననీ అంటున్నారు.
అయితే మంత్రి కేఎన్ రాజన్న మాత్రం తాజాగా శివకుమార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్నాటక కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని తేటతెల్లం చేశాయి. కేఎన్ రాజన్న సిద్దరామయ్యకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ కేఎన్ రాజన్న ఏమన్నారంటే.. ‘ఉపముఖ్యమంత్రి శివకుమార్ తన దృష్టిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంపై దృష్టి సారిస్తే మంచిది, అంతే కానీ రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి పదవి కోసం ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు’. ఆయన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలోని డీకే మద్దతుదారులు భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కినట్లైంది. ఈ పరిస్థితిని అధిష్ఠానం ఎలా సరిదిద్దుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/conflicts-in-karnataka-congress-39-191226.html