రోజాకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం? అసలేం జరుగుతోంది?
Publish Date:Jan 12, 2025
Advertisement
జగన్ ఐదేళ్ల అరాచకపాలనను జనం అసహ్యించుకున్నారు. ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరును, వారి అసహ్యకరమైన భాషను భరించలేకపోయారు. అందుకే ఎన్నికలలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు. బూతులతో రెచ్చిపోయిన మంత్రులలో ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేదంటే.. జనం వారిని ఎంతగా ఏవగించుకున్నారో ఇట్టే అవగతమౌతుంది. ప్రజా తిరస్కారానికి గురైన వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. భావించడం కాదు.. ఐదేళ్ల పాటు తమను అష్టకష్టాలూ పెట్టిన వైసీపీయుల అరాచకత్వం, దౌర్జన్యం, దుర్మార్గం, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే జనం కూటమికి బ్రహ్మరథం పడుతూ తీర్పు ఇచ్చారు.
వైసీపీ నేతలు కూడా తమ తప్పులకు కూటమి ప్రభుత్వంలో శిక్ష తప్పదని అనుకున్నారు. దీంతో భయంతో వణికి పోతూ ఈ ఆరు నెలలూ దాదాపు అజ్ణాత వాసం గడిపారు. అధికారం అండతో ప్రత్యర్థులపై బూతులతో రెచ్చిపోయిన వారిలో రోజా కూడా ఒకరు. ఆమెకు నగరి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన నగరి నియోజకవర్గం నుంచి ఆమెను ఓడించారు. ఆ ఓటమి ఎంత ఘోరంగా ఉందంటే.. పోలింగ్ రోజునే రోజా తన ఓటమిని అంగీకరించేసి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. బూతల రోతతో పాటు.. పర్యాటక మంత్రిగా ఆమె కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నిటిపైనా ఆమెపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలుంటాయని అంతా భావించారు. రోజా కూడా అదే భయంతో ఓటమి తరువాత చాలా కాలం ఎవరికీ ముఖం చూపకుండా చెన్నై చెక్కేశారు.
అయితే ఈ ఆరు నెలల కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే రోజా వంటి వారికి ధైర్యం నూరి పోసినట్లుగా వ్యవహరించింది. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవు. కేసులు లేవు. జగన్ హయాంలోఅధికారం అండతో ఇష్టారీతిగా వ్యవహరించిన వారిపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవని స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మాటవరసకైతే ప్రతీకార చర్యలు ఉండవని అన్నారు కానీ, చేతలలో మాత్రం అసలు అటువంటి వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశమే తమకు లేదని చాటారు. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తమకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని అర్ధం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి తామే అధికారంలో ఉన్నామన్నట్లుగా ఇష్టారీతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. తెలుగుదేశం కూటమి మెతకతనాన్ని అలుసుగా తీసుకుని మళ్లీ గతంలోలాగే నోటికి పని చెబుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా గతంలోలాగే అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర నాయకులపై అనుచిత ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. తిరుపతి ఘటనలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు చూస్తే వారందరికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారికి ఎంత అలుసు ఇచ్చిందో స్పష్టంగా అర్థమౌతోంది.
ముఖ్యంగా మాజీ మంత్రి రోజా తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన తరువాత నుంచీ రోజుకు రెండు మూడు సార్లు మీడియా ముందుకు వస్తూ ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయనది ఐరన్ లెగ్ అంటూ రెచ్చిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి సారీ రాస్ట్రంలో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతాయంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైనా నోటికొచ్చినట్లు విమర్వలు చేశారు. అటువంటి రోజా, శనివారం ఉదయం తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే, ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బంది ఆమెకు ప్రోటోకాల్ మర్యాదలతో బ్రేక్ దర్శనం చేయించి సాగనంపారు. దర్శనం చేసుకు వచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ మరోసారి టీటీడీ, సిఎం చంద్రబాబు నాయుడులపై నిప్పులు చెరిగారు. అసలు కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైందన్నదానికి టీటీడీ సమాధానం చెప్పాలి. అసలు ఆమె పేరును ఎవరు సిఫారసు చేశారు? దానిని ఎవరు ఆమోదించారు అన్న విషయం తేలాల్సి ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో రోజా ప్రొటోకాల్ దర్శనం పేరిట వందల మందిని తనతో తీసుకువెడుతూ దర్శనం టికెట్లను సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైంది? పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ మెతకతనాన్ని అధికారులు కూడా అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అసలు ప్రభుత్వానికి యంత్రాం గంపై పట్టులేనట్టు కనిపిస్తోందనీ, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీయుల హవాయే నడు స్తోందని అనిపిస్తోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/protocal-daarshan-to-roja-39-191224.html