బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
Publish Date:Jan 13, 2025
Advertisement
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయన పరిస్థితి ఇపుడు కొరివితో తలగోక్కున్నట్టు తయారయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకపోవడంతో కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
జిల్లా కలెక్టరేట్ లో అధికారిక కార్యక్రమంలో గందరగోళం సృష్టించి మీటింగ్ ను పక్కదారి పట్టించిన ఆరోపణపై కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్ట రేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో రసాభాసాగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కౌశిక్ రెడ్డి పచ్చి బూతులు తిట్టారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యేను ఉచ్చరించడానికి వీల్లేని పదజాలంతో తిట్టడం చర్చనీయాంశమైంది. వీరిరువు గతంలో మంచి స్నేహితులు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. కానీ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కౌశిక్ రెడ్డి సహించలేకపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే అరికపూడి కాంగ్రెస్ కు దగ్గరైనప్పుడు పెద్ద గొడవ చేశారు. నానా బూతులు తిడుతూ వార్తలకెక్కారు. తాజాగా సంజయ్ కుమార్ తో అదే తరహా గొడవ చేశారు. వాగ్వాదంతో గొడవ ప్రారంభమై చిలికిచిలికి గాలి వానగా మారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను గట్టిగా తోసేశారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేంలో గందరగోళం ఏర్పడింది. ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది.
ఇక తన పట్ల అసభ్యపదజాలంతో దురుసుగా ప్రవర్తంచిన ఆరోపణపై కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది.
కౌశిక్ రెడ్డిపై గత సంవత్సరం జులై ఒకటో తేదీన బిఎన్ఎస్ యాక్ట్ క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే . ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 122 126(2) బిఎన్ఎస్ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు. జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రభుత్వాధికారులను దూషించిన ఆరోపణ క్రింద కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొత్తగా పరిచయం చేసిన క్రిమినల్ కోడ్ బిఎన్ ఎస్ క్రింద కేసు నమోదైన మొదటి పొలిటిషియన్ కూడా కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం
http://www.teluguone.com/news/content/3-cases-registered-against-brs-mla-padi-kaushik-reddy-39-191242.html