సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా రేవంత్ కేబినెట్ విస్తరణ!
Publish Date:Jan 12, 2025
Advertisement
దాదాపు ఏడాది కాలంగా రేవంత్ తన కేబినెట్ ను ఎప్పుడు విస్తరిస్తారా అన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ పలు ముహూర్తాలు కూడా తెరమీదకు వచ్చాయి. కేబినెట్ విస్తరణే లక్ష్యంగా రేవంత్ పలుమార్లు హస్తిన వెళ్లి పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యారు కూడా. ఇంత జరిగినా తన కేబినెట్ విస్తరణ విషయంలో రేవంత్ అడుగు ముందుకు వేయలేకపోయారు.
అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పారు. కేబినెట్ విస్తరణతో పాటు ఇదే నెలలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా ఉంటుందని చెప్పారు.
గతంలోనూ చాలా సార్లు కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చినప్పటికీ విస్తరణ మాత్రం ముహూర్తం జరగలేదు. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లి వచ్చారు. అయినా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో ఇంత కాలంగా కేబినెట్ విస్తరణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే పరిస్థితి. ఈ లోగా ఏడాది కాలం గడిచిపోవడం.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు , హైడ్రా కూల్చివేతలు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ తడబాటు ఆయన ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. ఇక పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత.. రేవంత్ అసెంబ్లీ వేదికగా కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు తెలంగాణలో అనుమతించేదే లేదని ప్రకటన చేశారు.
అయితే ఆ మాటకు ఆయన కట్టుబడలేదు. దీంతో రేవంత్ సర్కార్ కు కోర్టు అక్షింతలు వేసింది. జనబాహుల్యంలో కూడా రేవంత్ మాట మీద నిలబడలేదన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. రేవంత్ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేబినెట్ విస్తరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు. సంక్రాంతి తరువాత కేబినెట్ విస్తరణ, ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ అనగానే.. పదవులు ఎవరెవరిని వరించబోతున్నాయి, ఎవరెవరికి నిరాశ మిగులుతుందన్న చర్చ మొదలౌతుంది. ఈ ఉద్దేశంతోనే సరిగ్గగా సంక్రాంతి పండుగకు ముందు కేబినెట్ విస్తరణపై ఫీలర్ వదిలారని అంటున్నారు. కేబినెట్ విస్తరణ తరువాత పార్టీలో ఒకింత అసంతృప్తి, అసమ్మతి రేగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే పార్టీ హైకమాండ్ ఇంత వరకూ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెడుతున్న రేవంత్ కు అసమ్మతి బెడద ఉండకూడదన్న ఉద్దేశంతోనే హైకమాండ్ విస్తరణను పెండింగ్ లో పెట్టిందని పరిశీలకులు విశ్లేషించారు. అదే కారణంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వాయిదా వేస్తూ వచ్చిందంటున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అధికారపగ్గాలు చేపట్టి ఏడాది గడిచిపోవడం, మంత్రిపదవులు, నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారిలో అసంతృప్తి పీక్స్ చేరుతున్న సంకేతాలు కనిపించడంతో ఏదైతే కానీ ముందు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలన్న నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-cabinet-expanssion-after-sankranthi-39-191233.html