రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది: బాబు
Publish Date:Apr 6, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోందని, రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసిందని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ పార్టీ సంస్కరణలు చేపడితే కాంగ్రెస్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన ఆరోపించారు. సేజ్‌ల పేరుతో ప్రభుత్వం పేదోడి పొట్టకొట్టిందని, తాగునీటి ఎద్దడి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయని బాబు పేర్కొన్నారు.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుతన్నారు. కాగా నాలుగు గంటలైనా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా సిండికేట్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఇసుకను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని, ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో గాలిని కూడా దోచుకుంటారేమో అని బాబు దుయ్యబట్టారు.
జగన్‌వి శవ రాజకీయాలని బాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, డీప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను హైకమాండ్ చిన్నపిల్లలకంటే హీనంగా చూస్తోందని ఎద్దేవా చేశారు. సీఎంకు వెన్నుముక లేదన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లతో సీఎంకు సంబంధాలున్నాయని బాబు ఆరోపించారు. విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్లపై విచారణ చేస్తున్న ఎసిబి జెడిని రాత్రికి రాత్రే బదలీ చేశారని ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, టీడీపీపై బురదజల్లడం మానుకొని తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, సకలజనుల సమ్మె హామీలను నెరవేర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసు ఎత్తివేయాలన్నారు. అక్రమ భూకేటాయింపులు, విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమాలు ఉదృతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అనిశ్చితికి కాంగ్రెస్సే కారణమన్నారు. కాగా ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హాజరయ్యారు.
http://www.teluguone.com/news/content/chandrababu-24-13207.html





