కాంగ్రెస్ కొ తిక్కుంది ... దానికో లెక్కుంది ...
Publish Date:May 14, 2012
Advertisement
గుంటూరు జిల్లాలోని మాచర్ల, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల రేస్ లో కాంగ్రెస్ ఇంకా వెనుకబడే వుంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు ఇప్పటికే మొదటిరౌండ్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం పలుసమస్యలతో సతమతమవుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయడంలోనే ఆలస్యం చేసింది. దీంతో తొలిదఫా ప్రచారంలోనూ ఆలస్యం జరిగింది. ఈ జాప్యం వెనుక గెలుస్తామన్న ధీమా ఆ పార్టీకి ఉందంటే అది అతిశయోక్తి మాత్రమే. ఎస్సీ నియోజకవర్గమైన ప్రత్తిపాడులో పార్టీ అభ్యర్థిగా టిజెఆర్ సుధాకర్ బాబును రంగంలో దించారు. ఈయన ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావటమే ప్రధాన అర్హతగా స్థానికనేతలు భావిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. అలానే మాచర్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ మొదట ప్రకటించిన అభ్యర్థిని మార్చింది. మొదట కర్రి పున్నారెడ్డి పేరు వినిపించింది. తరువాత సిఎం కు సన్నిహితుడైన పిన్నెల లక్ష్మారెడ్డికి టిక్కెట్టు లభించింది. అసలే జిల్లా పెద్దలు అనుకునే ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా భగ్గుమంటోంది. అందుకే వీరిద్దరూ ప్రచారంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఒకవైపు అంతర్గత సమస్యలు, మరోవైపు రెండు నియోజక వర్గాల్లో చొరవ ఉన్న నాయకులు లేకపోవటం వల్ల ఈ ఉప ఎన్నికలు పార్టీకీ, అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. ఎవరు ఈ తలనొప్పి తగ్గిస్తారా అని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, ఇతర నాయకుల రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఓటర్లు మాత్రం కాంగ్రెస్ కొ తిక్కుంది ... దానికో లెక్కుంది ... అంటూ నవ్వుకుంటున్నారు. ప్రచారంలో ముందున్న తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు ఎన్నిసార్లు ఓటర్ల చుట్టూ తిరిగినా గెలుస్తామనే నమ్మకం కుదరలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ఓటరును వదలడంలేదు.
http://www.teluguone.com/news/content/bypolls-in-macherla-and-prattipadu-24-14028.html





