అనంత ఉప ఎన్నికల్లో డీలా పడిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్
Publish Date:Jun 4, 2012
Advertisement
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి త్రిముఖ పోటీ తప్పదని పరిశీలకులు తేల్చేస్తున్నారు. కానీ, ఇటీవల సిబిఐ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని అరెస్టు చేయటంతో ఆ పార్టీలో ప్రచార ఉత్సాహం తగ్గింది. అరెస్టుకు మునుపు ఉన్నట్లు వైకాపా నాయకులు ప్రచారంలో శ్రద్ధచూపటం లేదని ఇక్కడి వాతావరణం చూస్తే అర్థమవుతోంది.
ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ రెండూ కూడా కాంగ్రెస్ కంచుకోటలే. తెలుగుదేశం పార్టీ కూడా అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ముందుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం చరిత్ర పరిశీలిద్దాం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. లక్షా 85 వేల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. బిసి నియోజకవర్గమైన ఇక్కడ తొలి ప్రస్థానం ప్రారంభించింది కమ్యూనిస్టులే. ఇప్పటివరకూ 9 సార్లు కాంగ్రెస్, సిపిఐ రెండు సార్లు, సిపిఎం ఒకసారి ఈ నియోజకవర్గంలో విజయం సాధించాయి. 1983లో40వేల భారీ మెజార్టీతో ఒకసారి, 1985లో ఒకసారి టిడిపి ఇక్కడ గెలిచింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముషీరాబెగం, టిడిపి నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్ ఆర్ సిపి నుంచి గుర్నాధరెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలుపొందిన గుర్నాధరెడ్డి ఈసారి వై.కా.పా. తరుపున పోటీ చేస్తున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలోజరిగిన 14ఎన్నికల్లో 10సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. రెండుసార్లు టిడిపి, రెండు సార్లు ఇండిపెండెంట్లు కూడా ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాటిల్ వేణుగోపాలరెడ్డి. టిడిపి అభ్యర్థిగా దీపక్ రెడ్డి, వైఎస్ ఆర్ సిపి తరుపున తాజామాజీ కాపు రామచంద్రారెడ్డి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. 1983 తరువాత కాంగ్రెస్ దూకుడుకు తెలుగుదేశం రెండుసార్లు కళ్లెం వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాలరెడ్డి, టిడిపి అభ్యర్థి దీపక్ రెడ్డి మధ్య గొడవలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంతలా ఈ వివాదాలు రాజుకున్నాయి. దీంతో పట్టుదలలు పెరిగి రెండు పార్టీలూ తమ బలప్రదర్శన కూడా చేసుకున్నారు.
వేణుగోపాలరెడ్డి స్వగ్రామమైన పల్లేపల్లిలో దేశం అభ్యర్థి దీపక్ రెడ్డి, దీనికి ముందు దీపక్ రెడ్డిని, ఆయన అనుచరులను వేణుగోపాలరెడ్డి కుమారులు గాయపరుచుకున్నారు. పోలీసుస్టేషన్ లో కేసుల దాకా ఈ గొడవ చేరుకుంది. దీంతో తమకు లాభం చేకూరుతుందని వై.కా.పా. అభ్యర్థి కాపురామచంద్రారెడ్డి భావించారు. అనుకోకుండా ఆ పార్టీ అధినేత జగన్ ను సిబిఐ అరెస్టు చేయటంతో ఇక్కడ వై.కా.పా. స్వరం తగ్గించింది. ప్రచారంలో కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఈ దశలో కాంగ్రెస్ తరుపున ప్రచార బాద్యత తీసుకున్న మంత్రి రఘువీరారెడ్డి తన ఇంటర్వ్యూలో కాపును అసమర్ధుడని రెచ్చగొట్టారు. ఒకవైపు ఓట్లు చీల్చగలిగేంత బలం ఉన్న కాపును ఆయన రెచ్చగొట్టడం వల్ల త్రిముఖపోటీ తప్పేలా లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే ప్రచారం తగ్గినందున దేశం, కాంగ్రెస్ ల మధ్యే పోటీ ఉండేదంటున్నారు. విజయమ్మ ప్రచారానికి వస్తే కాపు తిరిగి తన బలాన్ని పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/ananthapur-byelections-24-14599.html





