రియల్టర్ల చేతిలో వినోభా భావే భూదాన భూములు
Publish Date:Oct 8, 2012
Advertisement
దేశంలో చాలా మంది నిరుపేదలు తాము బ్రతుకు వెళ్ల దీయాలంటే భూమి ఉంటే సాగుచేసుకుంటామని వినోభాబావే పాదయాత్ర లోచెప్పారు. వారి స్థితిగతులను చూసి చలించిన వినోభాబావే భూదాన యజ్ఞం 1951 లో మొదలు పెట్టారు. 1970 వరకు దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాలు సేకరించి సుమారు 40 లక్షల మందికి పంచారు. మన రాష్ట్రంలో 1.70 లక్షల ఎకరాలు సేకరించగా 1.26 లక్షల ఎకరాలకు మాత్రమే చట్ట బద్దత ఉంది. పట్టాలు ఇచ్చినా చాలా మందికి సరిహద్దులు చూపక పోవడం, రికార్డులు సరిగా లేక పోవడంతో లబ్ధిదారులు సాగుచేయటానికి ఆటంకంగా మారింది. దీంతో అధికారులు, నాయకులు కలసి ఈ భూములను రియల్ వ్యాపారులకు అమ్మేశారు. అయితే వీటిని తిరిగి స్వాదీనం చేసుకుని పేదలకు అప్పగించాలని చర్యలు చేపట్టాలని, డిల్లీలో జరిగిన రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో కేంద్ర గ్రామీణ మంత్రి జైరాం రమేష్ చెప్పారు. భూదాన చట్టం ప్రకారం భూమిని పొందిన లబ్ధిదారులుక్రయవిక్రయాలు చేసేందుకు వీలులేదు. లబ్దిదారుల వంశీయులు తరతరాలుగా అనుభవించడానికి మాత్రమే వీలు కలుగుతుంది. అయితే హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని చాలా భూములు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లి పోయాయి. చట్టాన్ని అతిక్రమించి ఆయా భూములకు రిజిస్ట్రేషన్లు, పాసుపుస్తకాల జారీ కూడా జరిగింది. హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలయిన పోచంపల్లి, బీబీనగర్, చౌటుప్పల్ మండలాల్లోని భూముల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ వెంచర్లు వెలిసాయి. భూదాన యజ్ఞ బోర్డు తన లక్ష్యాలను మరచి పోయింది. భూదాన భూములను పట్టించుకోవడం మానేసింది. ఎంతో శ్రమకోర్చి కాలినడకన తిరిగి దళితులకోసం భూదాన యజ్ఞం చేసిన మహనీయుడి ఆశయాల కోసం భూదాన బోర్డు పనిచేయాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/-indian-labourers-24-17996.html





