ఉండ్రాళ్లైనను సరియే ఓర్పుతోడ మెక్కుతావు
ఉమ్మెంతలు చప్పరించి నెమ్మది చెడకుంటావు
సిద్ధి రిద్ధి కళ్యాణుల చేరి మురుస్తుంటావు
గణపతి! నీ పూజలేక కాదు దేనికారంభము
అందుకే ఏ పనికైనను
ముందు నీకు తాంబూలము
చేదుగొంతు అయ్యకన్న నీ వన్ననె భయము మాకు
ఏదో ఎన్నడో ముందు ఏనాడో ప్రళయమందు
కొసరు కన్ను తెరచినపుడు కసిబూనుచు మంటలెగయు
ప్రాణాలతో అనాటికి లక్షణముగ మిగిలియున్న
వారికి కద! అతని భయము వారి చింత మాకెందుకు
ముందుగ నీ బారి నుండి బ్రతికి బయట పడవలె కద!
దినగండము అడుగడుగున
కనబడని నీ అలుకలు అడ్డంకులు
కనుల బడెడి ఈ ఎలుకలు
తొలగిపోవు నీ పూజలు సలిపిన కద!
ముందడుగు, బ్రతుకుతెరువు
నీవన మాకెంతో భయము
నీ గణమున మా గుండెలదరు
నీ వాహన దర్శనమున
మా గుండెలె ఆగిపోవు
భయభవ హరమగు భక్తితో
గణనాయక! నిన్నెప్పుడు పూజింతము
గరికపోచలైన సరే పెరికి నీకు అర్పింతుము
ప్రళయ భీకరాకారుడు ఆరుద్రుడు మీ నాయన
భూత ప్రేత పిశాచాల కతడునేత సాక్షాత్ పశుపతి.
అట్టి దొరకు వాహనమగు
నందీశుని బలగానికి
బండెడు చాకిరి చేయగ
ముక్కుకు ముగుదాడేసెడి
బలము మాకు అలవడినది
నీ వాహనమగు మూషిక
ముష్కరాల సంతానము
క్షుద్రప్రాణి సముదాయము
నిబ్బరముగా మా తలపై
తైతక్కలు ఆడుతోంది
నీ వాహనాన్ని, దానికున్న బలగాన్ని
బలగం బలాన్ని, దాని ఉద్ధృతాన్ని
వోపలేక ఉన్నాము ముక్తి మార్గ మరయలేక
నీ సవారి బారి నుండి మమ్ముల తప్పించి కాయ!
విఘ్నేశ్వర! గణనాయక! అథినేత! మహాకాయ
నీకె కాదు నీ అబ్బకు శక్తి చాలదనిపించును
చిట్టెలుకలు పొట్టెలుకలు
పందికొక్కు సమూహాలు
అడవెలుకలు కొండెలుకలు
చుండెలుకలు మెత్తనగాళ్లు
వేలూ లక్షలు కోట్లు
పిల్లుల చెవులనె కొరుకును
ఎల్లెడలను తిరుగాడగ
తల్లడిల్లు సామాన్యుల
సంగతి ఏమని చెప్పను?
ఉండ్రాళ్లకు మిగులకుండ
ఉదయాస్తమానాలూ
నీ సవారి చాలించుక |
|
తిరుగాడెడి మూషికాలు
మెక్కుచుండ ధాన్యమంత
పట్టపగలె మా యిండ్లలో
కన్నాలు వేయుచుండ ఏమిటి గతి?
మా జేబులు కత్తిరించు చిరు'పన్నుల' కత్తెరలు
ఏకదంతా! నీ దంతి సంతానమునకు కలదు
ఏది ఎక్కడుంచిననూ క్షణంలోన మాటుమాయము
నీ గణమున కందెంతో అనుగుణమగు వజ్జెవాట
వదంతికాదు వాస్తవమగు
ఉదంతమిది ఏకదంతా!
మా పెరళ్లన్ని పొలాలన్ని
నీ వాహన బలగానికి
నేల బొయారాలు విహారాలు
భూగతమగు భవంతులు కోటలు గడీలు
నందీశుని కష్టఫలము
దిగమ్రింగెడి మూషికాల
నప్పుడపుడు చప్పరించు
మీ నాయన భూషణాలు
ఫణిరాజుల సమూహాలు
అయిననేమి నీ సవారి
వరప్రసాదిగా తోచును
దాని సంతానము ఎడతెగనిది
దానికెపుడు ఎదుగె కాని లొదుగులేదు
ఎటు జూచిన అటు అగుపడు నీ అలుకలు
కోటలో సైతం పాగా వేసెను నీ ఎలుకలు
నీ ముష్కరమూషికాల బారి నుండి దాడి నుండి
మా ఆహారము అచ్ఛాదము జ్ఞానఝరీభాండారము
కాపాడెడి దిక్కులేదు
నీ తలగల దేహాలను మహా మహా కాయాలను
మకరితోడ పోరిపోరి హరి కృపచే ముక్తమైన
గజరాజుల బలగాలను లొంగదీసినట్టి మేము
నీ ముష్కర మూషికాల నీ వాహనమగు ఎలుకల
నెదురలేక ఉన్నాము తెల్లమొగాలేసినాము
మా గతి మా ప్రస్తుత దుస్థితి
కారకమగు ఈ ఎలుకలు నీ అలుకలు
తమ ప్రతిభతో నేసినట్టి
మా గోడలకన్నాల్లో తలయెత్తుచు
మా చూర్లబట్టి పరుగులిడుచు
కిచకిచయని ఇగిలించును
మమ్ముజూచి సవాల్ జేయుచున్నట్టుల
నీ వాహన బలగాలగు ఈ ముష్కర మూషికాలు
మ్రింగలేక వదిలేసిన దేమున్నది?
పల్లేరులు, జిల్లేడులు
ఉమ్మెత్తలు, గన్నేరులు
గరిక, పరక పిల్లిపిసరు
అవియైనను నీ కొరకని
వదలెనేమో దయదలంచి
ఇంక మాకు మిగిలినట్టిదేమున్నది
గరళము, పచ్చి విషము, పాషాణము
అదియైనను మీ నాయన గొంతులోన దాగున్నది
గణనాయన! వక్రతుండ! విఘ్నేశ్వర!
ఏకదంత! లంబోదర! వినాయకా! |