పురాణాల్లో గణపతి జననం గురించి అనేక కధనాలు ఉన్నాయి. అందులో ఒక కధనాన్ని అనుసరించి -
పార్వతీదేవి ఒకసారి కాలక్షేపానికి సున్నిపిండితో ఓ బాలుని బొమ్మ చేసి, కొంతసేపు ఆడుకుని, తర్వాత గంగలో పడేసిందట. ఆ బాలుడి బొమ్మ గంగలో చక్కగా పెరగడం ఆరంభించిందట. గంగ ఆ బాలుని తన పుత్రుడిగా భావించి, పెంచినట్లు పద్మపురాణంలో ఉంది.
మరో కధనం ప్రకారం గణపతి ఉద్భవ కధ ఇలా ఉంది-
శివుని కాంక్షించి, వివాహమాడదలచిన పార్వతి, తన కోరిక నెరవేరాలని ఘోర తపస్సు చేసింది కదా! శివుని ప్రసన్నం చేసుకోడానికి గడ్డ కట్టించే మంచును, ధారాపాతంగా కురుస్తున్న వర్షపాతాన్ని లెక్క చేయకుండా తపస్సు చేసింది. మండుటెండలో చుట్టూ కట్టెల మంటలు పెట్టుకుని మరీ దీక్ష చేసింది. అసలే భోలాశంకరుడు. అంత మహా తపస్సుకు చలించకుండా ఉంటాడా? హిమ తనయను వివాహమాడటానికి సమ్మతించి ససిద్ధత తెలియజేశాడు.
పార్వతి సంతోషంగా తపస్సు ముగించి ఇంటికి చేరింది. పర్వత స్త్రీలు, పార్వతీదేవికి అభ్యంగన స్నానం చేయించారు.సుదీర్ఘకాలం పాటు దీక్షలో ఉన్న పార్వతి దేహానికి పేరుకున్న మట్టిని తీసి, ఉండగా చేసి ఆమె చేతిలో పెట్టారు. పార్వతీదేవి నవ్వుతూ, ఆ మట్టితో గజముఖాకృతిని తీర్చిదిద్దింది. పవిత్ర జలధారతో అభ్యంగన స్నానం చేయించి, ప్రాణ ప్రతిష్ట చేసింది. తాను తీర్చిదిద్దిన బాలుని చక్కటి ఆభరణాలతో అలంకరించింది.
పర్వత స్త్రీలు ఆశ్చర్య ఆనందాలతో చూడసాగారు. అందరూ చూస్తుండగానే, గజముఖుడు ఊపిరి పోసుకుని, దివ్య తేజస్సుతో నిలబడ్డాడు.
పార్వతీదేవి చిరునవ్వు నవ్వుతూ బాలుని చూసి, ''గజముఖా! నువ్వు నా పుత్రుడివి.. నేను స్వయంగా సృజించిన వరపుత్రుడివి.. భవిష్యత్తులో నువ్వు సర్వ పూజ్యుడివి అవుతావు.. సకల విఘ్నాలను నివారించే శక్తిసంపన్నుడివి అవుతావు..'' అంటూ తలపై నిమిరింది.
గజముఖుడు సంతోషంగా తల పంకించాడు. అలా ఉద్భవించిన గణపతి, విఘ్నేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.
|