వినాయకుడు మనందరికీ ఆరాధ్య దైవం. పూజా మందిరంలో ఇతర దేవతలతోబాటుగా గణేశుని విగ్రహమూ ఉంటుంది. మరో పేరు విఘ్నేశ్వరుడు. ఏ పని తలపెట్టాలన్న అందులో ఎలాంటి విఘ్నాలూ కలక్కుండా గణపతిని పూజిస్తాం. ఇంతకీ గణపతి అనే పేరు ఎలా వచ్చింది? “గణం” అంటే సమూహం లేదా గుంపు అని అర్ధం. ఇప్పట్లా ఇళ్ళు, వాకిళ్ళు, నాగరికత తెలీని ప్రాచీన కాలంలో ఆది మానవులు గుంపులుగా, వర్గాలుగా జీవించేవాళ్ళు. నీటి వనరులు, తల దాచుకోడానికి చెట్లు, కొండలు ఉన్న ప్రాంతాలను నివాసాలుగా చేసుకునేవాళ్ళు. అలాంటప్పుడు సహజంగానే క్రూర మృగాలను చూసి భయపడి ఉంటారు. అదే సమయంలో ఏనుగులు వారిని ఆశ్చర్యంలో ముంచి ఉంతాయి. మెత్తగా, సాధు జంతువుల్లా వేటి జోలికీ వెళ్ళకుండా, తమ మానాన తాము ఉంటూనే , అవసరమైనప్పుడు శత్రుమూకను గజగాజలాడిస్తూ, మట్టి కరిపించే గజరాజుల గాంభీర్యం, శక్తీ సామర్ధ్యాలు అతిశయానికి లోనుచేసి ఉండొచ్చు. క్రమంగా ఆదిమానవులకు ఏనుగులపట్ల ఆరాధనాభావం ఏర్పడి ఉంటుంది. అవి తమకు హాని తలపెట్టకుండా ఉండేందుకు వాటితో ప్రేమగా, అనునయంగా ఉండి ఉంటారు. ఏనుగుల సామర్ధ్యం తమకూ ప్రాప్తించాలని కోరుకుని ఉంటారు. పులులు, సింహాలు, భయానక విష సర్పాల నుండి తమకు హాని కలకూడదని, గజాలను ప్రార్దించడం ప్రారంభమయ్యుంటుంది. అలా ఆదిమానవుల గణాలు ఏనుగులను పూజించడం మొదలై ఉంటుందని, ఆవిధంగా వినాయకుడి రూపకల్పన జరిగిందని పెద్దలు చెప్తారు. గణాల చేత పూజలు అందుకున్నందువల్లనే ‘గణ’పతి అయ్యాడని అంటారు. గణపతి నామ సార్ధక్యం అదన్నమాట.
|