తపస్సుతోను త్రిమూర్తులను
మెప్పించి వరాలను పొంది తమను బాధించకుండా వుండటానికై, ఒకమారు దేవతలందరూ సమావేశమై దేవతల కల్యాణానికి గాను రాక్షసులు తలపెట్టు ధర్మకార్యాలకు విఘ్నం కల్గించే విఘ్నరాజును సృష్టి౦ప వలసిందిగా శివుని ప్రార్ధించారు. శివుడు వారి అభిష్టమును పూర్తిచేసే వుద్దేశ్యంతో లోకమాతయగు
పార్వతి త్రిశూల-పాశాలను ధరించిన గజవదనుడైన కుమారునికి జన్మనిచ్చినట్లు లి౦గపురాణ౦లో చెప్పబడింది. ఈ రీతిగా జన్మించిన గజముఖునికి శివుడు జాత కార్మదులను గావించి అతని అవతార కారణాన్ని వివరించాడు. త్రిలోకాల్లో
కూడా గణపతి పూజార్హుడని ఆశీర్వదించాడు. అతనిని ఆరాధింపకుండ ప్రారంభించునట్టి శ్రౌతస్మార్త కర్మలకు, వివాహాది శుభకార్యాలకు విఘ్నాలు వాటిల్లునట్లు విధించాడు. దుష్ర్పవర్తకులు తలపెట్టు పనులు కూడా సజ్జనులు ఆరంభించు పనులవలె సునాయాసంగా పూర్తికావటం వల్ల మంచికి మన్నన లేకపోయింది. అందువల్ల దుర్జనుల కార్యాలను విఘ్నము కలిగించు విఘ్నదేవత అవసరమని దేవతలు ఆలోచించి మహేశ్వరుని వద్దకు వెళ్లి తమ మనోభీష్టాన్ని విన్నవించు కొన్నారు. దేవతల మొరను ఆలకించిన శివుడు సంతోషంతో పార్వతి ముఖాన్ని అవలోకించినాడు. అప్పుడతనికి భూమి,నీరు, గాలి, తేజస్సులకు ఆకారములు౦డగా ఆకాశం మాత్రం రూపరహితంగా వుండుట అసంగతంగా తోచింది. అంతకు ముందు పరబ్రహ్మ, పృథివ్యాప్ తేజో వాయువులతో గణపతి అవతరించునని చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి నవ్వినాడు. అప్పుడు పై నాల్గు
అంశములతో అమిత తేజోవంతుడు, ప్రకాశ వదనము కలవాడు, రెండొవ రుద్రుని వలె విరాజిల్లు వాడు అయినట్టి కుమారుడు మూర్తీభవించినాడు.పుట్టిన వెంటనే సకల దేవతలను ముగ్ధలుగ చేయునట్టి అతిలోక సుందరాకారుడగు కుమారుని పార్వతి రెప్పవాల్చకుండా చూచింది. అది గమనించిన శివుడు కుపితుడై కుమారునికి ఏనుగుతల, బొజ్జ కడుపు ఏర్పడునట్లు శపించినాడు. కానీ అంతటితో అతని కోపం శాంతించనందున శరీరాన్ని విదిలించాడు. అప్పుడతని రోమకూపాలనుండి స్వేద బిందువులు నేలరాలినవి. తత్పలితంగా ఏనుగు తల, కానుగు, నీలము, కాటుక, వర్ణముతో, వివిధములగు ఆయుధాలను ధరించి పెక్కురు వినాయకులు ఆవిర్భవించినారు. వారి వల్ల భూమి దద్దరిల్లింది.
అప్పుడు బ్రహ్మ విచ్చేసి పరమశివుని వదనం నుండి ఆవిర్భవించిన వినాయకుడు,ఆ తరువాత పుట్టిన వినాయకులకు అధిపతిగ చేయునట్లు సూచించాడు.శివుడు అందుకు సమ్మతించి గజముఖునికి పెక్కు ఆయుధాలనూ, గణనాయక పదవినీ, అగ్రపూజా గౌరవాన్ని అనుగ్రహించి వినాయకునిగ పట్టాభిషేకం చేసినాడు |