ఋగ్వేదకాలం నాటి అనేక దేవతలు పురాణకాలమున నామాంతరాలతో పునర్జన్మ లెత్తినట్లు గమనించవచ్చు. ఋగ్వేద కాలంలో ఇంద్ర, వరుణ, అగ్ని, సూర్య, సోమ – దేవతలే ప్రధాన దేవతలు. వీరుకాక ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవస్తువులు తదితర దేవతాబృందాలుండేవి. వారిలో అతి ముఖ్యులుగ పరిగణింపబడిన ఇంద్రాదులలో కొందరు కాలక్రమంలో దిక్పాలకులయ్యారు. నామాంతరాలతో కొందరు ఉన్నత పదవులందుకొన్నారు. క్రూరుడుగ పరగణింపబడుతున్న రుద్రుడు మంగళకరుడైన శివుడయ్యాడు. ఇద్దరు ముగ్గురు దేవతల శక్తి ఒక్కరిలోనే కేంద్రీకృతమైంది. అజ ఏకపాద, ఋభు త్రిత ద్యావా పృథ్వి, వృషాకపి మున్నగు దేవతలను విస్మరించటమూ జరిగింది. మానవ వికాసానని అనుసరించి, ఆరాధించె దేవతల గుణరూపాల వికాసం వృద్ధిచెందుతోంది. సాత్విక తత్వము గలవారు దేవతలను, రాజస గుణము కలవారు యక్షరాక్షసులను, తమోగుణం గలవారు భుతప్రేతాలను పూజిస్తారు. మనుష్యుల ఆహారమే అతని దేవతల ఆహారమవుతుంది. ఈ తత్వమే గణపతి వికాసానికి కూడా అన్వయిస్తుంది. ఋగ్వేద దేవతల హెచ్చుతగ్గులతో
గణపతి వికాసం జరిగింది.
ఒకానొకప్పుడు తనకంటే శక్తిమంతమూ, దేహబలమూ, బుద్దిబలమూ, కల్గి తనను మించిన విశిష్ట శక్తి ఒకటి వున్నదని భావించినపుడే దైవము అనే భావన కూడా అంకురించింది. ఎవరూ నీరు పోయినప్పటికీ చెట్లు పెరుగుతున్నాయి. వర్షపాతం భూమిని చల్ల బరుస్తోంది. సూర్యుని వెలుగు వస్తోంది, అంతలోనే కనుమరుగు అవుతోంది. వింత వింత శబ్దాలు ధ్వనించి మ్నాయమౌతున్నాయి. అగ్ని దహిస్తుంది. వెలుగు ప్రసరిస్తోంది, తిరిగి చీకటి ఆవరిస్తోంది. పని చేసేందుకు ప్రేరేపిస్తోంది. వీటన్నిటిని నియంత్రించేవాఋ ఎవరు? ఈ ప్రశ్నయే మనం కొలిచే దేవతల సృష్టికి, కల్పనకు కారణమైంది.
గాలి, నీరు, అగ్ని, సూర్యుడు మొదలైన ప్రకృతి శక్తుల మధ్య జీవించే మానవుడే వాటి ప్రభావానికి గురియై వాటికి వ్యక్తిత్వాన్ని కల్పించాడు. ఆ శక్తుల ఆజ్ఞ వల్లనే ఒక క్రమబద్దమైన వ్యవస్థ ఏర్పడిందనే నమ్మకం ఏర్పడింది. |