గణపతి ఆకృతే కాదు, జననమూ ఆశ్చర్యంగానే ఉంటుంది. స్కాంద పురాణం ప్రకారం గణపతిని ఏ సందర్భంలో, ఏ ఫలితాన్ని ఆశించి సృజించారో తెలిపే కధ ఇలా సాగుతుంది.
పూర్వం మానవులు భోగ కాంక్షతో స్వర్గం పట్ల ఆకర్షితులయ్యారు. తీవ్ర తపస్సు చేసి యదేఛ్చగా స్వర్గానికి వెళ్ళసాగారు. దాంతో దేవలోకం మానవులతో నిండింది. అలా వెళ్ళిన మానవులు దేవతలపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. దేవతలు మానవజాతిని చూసి భయానికి లోనయ్యారు. ఒకదశలో ఆ భయం మరీ ఎక్కువవడంతో, దేవేంద్రుడు కైలాసానికి ప్రయాణం కట్టాడు. పార్వతీపరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. నెమ్మదిగా ''మానవులు తమ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా దేవలోకానికి వస్తున్నారని, రోజురోజుకీ వారి సంఖ్య పెరుగుతోందని, తమను లక్ష్యపెట్టకపోగా, అనేకరకాలుగా బాధిస్తున్నారని విన్నవించుకున్నాడు. ఈ బాధ నుండి తమను కాపాడమని ప్రార్ధించాడు.
దేవేంద్రుడు చెప్పినదంతా ప్రశాంతంగా విన్న పరమేశ్వరుడు, పక్కనున్న పార్వతీదేవి వంక చూశాడు. పార్వతీదేవి అప్పటికప్పుడు మట్టితో ఒక ఆకృతిని రూపొందించింది. ముఖం ఏనుగుని పోలి ఉండి. నాలుగు చేతులు ఉన్నాయి. పెద్ద శరీరం. బొజ్జ ముందుకు పొడుచుకువచ్చి ఉంది. ఆ ఆకారం బహు వింతగా, విడ్డూరంగా ఉంది.
సృజించిన వెంటనే గజాననుడు పార్వతీదేవికి వినయవిధేయతలతో నమస్కరించాడు. ''అమ్మా, నన్ను సృష్టించిన కారణం ఏమిటో చెప్పు'' - అని అడిగాడు.
పార్వతీదేవి మందహాసం చేసి ''నాయనా, నీవల్ల కావలసిన పనులు ఉన్నాయి కనుకనే నిన్ను సృజించాను. నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు. ఎవరైతే స్వర్గానికి వెళ్లాలని, మోక్షం పొందాలని కోరుకుంటున్నారో, వారికి విఘ్నాలు కలిగించు. వారి ఆశ నేరవేరనీయకు. ఈ విషయంలో నీకు నంది, మహాకాలుని అధీనంలో ఉండే అన్ని గణాలూ సహాయం చేస్తాయి. అయితే నీదే ముఖ్య పాత్ర. వారు నీకు సహాయకులుగా ఉంటారే తప్ప నువ్వే ప్రధాన నాయకుడివి...'' అంది.
మహాశివుడు తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.
పార్వతీదేవి వెంటనే తీర్ధ, ఔషధాలతో స్వయంగా గాజాననునికి అభిషేకం చేయించింది.
ఈ ఉందంతాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న 33 కోట్ల దేవతలు సంతోషంతో పూలు జల్లారు.
పరమేశ్వరుడు, గణపతి చేతికి పదునైన గొడ్డలిని అందించాడు. బ్రహ్మ త్రికాల జ్ఞానాన్ని, విష్ణుమూర్తి బుద్ధిని ప్రసాదించారు. పార్వతి మోదకపాత్ర ఇచ్చింది. కుబేరుడు ఐశ్వర్యాన్ని, సూర్యభగవానుడు ప్రతాపాన్ని, చంద్రుడు కాంతిని ఇచ్చారు. కార్తికేయుడు ఎలుకను వాహనంగా సమర్పించాడు. దేవేంద్రుని ఆనందానికి అంతు లేదు. తాను కూడా సౌభాగ్యాన్ని ఇచ్చాడు.
ఈవిధంగా ఒక్కొక్కరూ ఒక్కో వరాన్ని ఇవ్వగా గణపతి అపార శక్తిసంపదలతో, అంతులేని బలశాలిగా రూపొందాడు.
పార్వతీదేవి ఆజ్ఞను అనుసరించి భూలోకానికి వెళ్ళాడు. స్వర్గలోక, మోక్షాలను ఆశించి, తపించేవారికి శక్తిమేరకు విఘ్నాలు కలిగించసాగాడు. ఆవిధంగా మానవులు స్వర్గలోకానికి వెళ్లడం తగ్గింది. తమ సమస్య నివారణ అయి, దేవతలు సంతోషించారు.
అప్పట్నుండి మానవలోకంలో విఘ్నేశ్వరుడంటే భయం ఏర్పడింది. ఏ పని ఆరంభించినా ముందుగా విఘ్నేశ్వరుకి ప్రార్ధించి అడ్డంకులు ఎదురవకుండా చూసుకోసాగారు.
|