మెగా బ్రదర్స్ కలుస్తున్నారా?
on Mar 23, 2015
కలసి ఉంటే కలదు సుఖం.. అనే నిజం మెగా బ్రదర్స్‌కు తెలిసొస్తోందా? త్వరలోగా అన్నదమ్ముళ్లంతా ఏకం కాబోతున్నారా? ప్రస్తుతం మెగా సమీకరణాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. చిరంజీవి - పవన్ కల్యాణ్‌ల మధ్య ఓ అడ్డుతెర ఉందని, ఇద్దరూ దాన్ని ఛేదించే ప్రయత్నం చేయట్లేదని,ఆ అడ్డు తెర క్రమక్రమంగా గోడగా మారిందని మెగా ఫ్యాన్స్‌కు తెలుసు. ఇది వరకు చిరంజీవి ఫ్యాన్స్‌గా ఉన్నవాళ్లు ఇప్పుడు చిరు ఫ్యాన్స్‌గా, పవన్ ఫ్యాన్స్‌గా విడిపోవడానికి కారణం అదే. చిరంజీవిని, పవన్ కల్యాణ్‌నీ ఒకే వేదికపై చూసి చాలా కాలం అయ్యింది. `అన్నయ్య నా గుండెల్లో ఉన్నాడు` అని పవన్ చెప్పినా - `మేమంతా ఒక్కటే` అని చిరంజీవి వల్లించినా - జనానికి రుజువులు కావాలి. ఆ మాటల్ని నిలబెట్టుకోవాలి. కానీ అటు చిరు, ఇటు పవన్ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడా తరుణం వచ్చింది. అన్నాదమ్ముల్ని కలపడానికి మరో మెగా బ్రదర్ నాగబాబు ముందుకొచ్చాడని టాలీవుడ్ టాక్. చిరంజీవి - పవన్ కల్యాణ్‌ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారాయన. వీళ్లిద్దరినీ కలుపుతానని మెగా ఫ్యాన్స్‌కీ మాటిచ్చేశారు.
ఈమధ్య హైదరాబాద్‌లోమెగా ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్ర్రాల్లో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలమీద మెగా ఫ్యాన్స్‌కీ నాగబాబుకీ మధ్య చర్చ జరిగింది. చిరంజీవి ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ అని విడిపోవడం వల్ల మిగిలిన అభిమాన సంఘాల మధ్య చులకన అవుతున్నామని, సినిమా వసూళ్లపై కూడా ఆ ప్రభావం పడుతోందని, జనాలకు తప్పుడు సంకేతాలు అందుతున్నాయని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ గురించి బాగా మాట్లాడితే చిరు ఫ్యాన్స్‌కీ, చిరంజీవిని స్థుతిస్తే పవన్ ఫ్యాన్స్‌కీ కోపాలు వస్తున్నాయని ఈ పద్ధతి మంచిది కాదని నాగబాబు కూడా అభిప్రాయపడ్డారు. అందుకే.. అతి త్వరలోనే `మేమంతా ఒక్కటే` అని తెలిసేలా... ఓ కార్యక్రమం నిర్వహిస్తానని ఆయన మాటిచ్చారట. దాంతో ఫ్యాన్స్ కొద్దిగా కుదుటపడ్డారు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్‌లానే ఉండాలని నాగబాబు హితవు పలికారు. ఈ ఫ్యాన్స్ మీటింగ్ ఉద్దేశం కూడా అదే. అభిమానుల్ని సంఘటిత పరిచి - వచ్చే సినిమాల వసూళ్లు పెరిగేలా చూసే బాధ్యత నాగబాబు తీసుకొన్నారు. అందుకే ఈ మీటింగ్ నిర్వహించారు. మొత్తానికి చిరు, పవన్ ఒక్కటవుతున్నారన్న సంకేతాలు... ఈ మీటింగ్ ద్వారా అందాయి. మరి ఆ వేడుక ఎప్పుడో చూడాలి.