ఉత్తమ విలన్ రివ్యూ
on May 3, 2015
కమల్‌హాసన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఫోకస్ పెరిగిపోతుంది. కమల్ ఈసారి ఏం చెబుతాడు? ఎన్ని అద్భుతాలు తీస్తాడు? అనే ఆశ మొదలవుతుంది. చాలాసార్లు ఈ ఆశని తన ఊహలతో బతికించాడు కమల్. అందుకే కమల్‌పై ప్రేక్షకులకు, సినీ అభిమానులకూ ఎంతో నమ్మకం. ఉత్తమ విలన్ కూడా ఆ నమ్మకాన్ని కొంత వరకూ నిలబెట్టిందనే చెప్పాలి. వయసు పెరుగుతున్నా.. మాస్ ఇమేజీ కాపాడుకోవడం కోసం ఫక్తు కమర్షియల్ సినిమాలతో కాలం చేస్తున్నారు బడా హీరోలు. వాళ్ల మధ్య కమల్ నిజంగానే డిఫరెంట్‌గా కనిపించాడీ సినిమాలో. కమల్ ఈ సినిమా గురించి ముందే హింట్ ఇచ్చినట్టు ఇందులో సుమో ఛేజింగులు లేవు, ఫైట్స్ లేవు, డాంభికాలు లేవు. కానీ ఆర్థ్రత ఉంది. ఓ కథ ఉంది. రెండు కథల్ని ఒకే చోట ముడిపెట్టి నవ్వించి కవ్వించి ఏడిపించిన కమల్ తెలివితేటలున్నాయి. మరి ఉత్తమ విలన్ ఎలా ఉంది? కథేంటి? లోటుపాట్లేంటి? చూసొద్దాం.. రండి.
మనోరంజన్ (కమలహాసన్) ఓ హీరో. తన ఎదుగుదలకు ఇద్దరు వ్యక్తులు కారణం. ఒకరు దర్శకుడు మార్గ దర్శి (కె.బాలచందర్). మరొకరు నిర్మాత.. పూర్ణచంద్రరావు (కె.విశ్వనాథ్). మనోరంజన్‌లోని అద్భుతమైన నటుడ్ని తీసుకొచ్చింది మార్గదర్శి అయితే, తన కెరీర్ సవ్యంగా సాగడానికి వరుసగా సినిమాలు తీసిన వ్యక్తి... పూర్ణచంద్రరావు. ఆయన కూతుర్ని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సివస్తుంది మనోరంజన్‌కు. అంతకు ముందే కమల్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మనో పెళ్లయ్యాక.. ఆ అమ్మాయి జాడ తెలియకుండా పోతుంది. ఏళ్లు గడుస్తాయి. మనో ఓ సూపర్‌స్టార్ అవుతాడు. మనో కొడుకు పెద్దవాడవుతాడు. ఈలోగా తన జీవితానికి సంబంధించిన రెండు కీలకమైన విషయాలు తెలుస్తాయి. అదేంటంటే.. ఎప్పుడో కనిపించకుండా పోయిన తన ప్రియురాలు తన వల్ల ఓబిడ్డకు జన్మనిచ్చిందని. రెండోది... తనకు బ్రెయిన్ ట్యూమర్ అని. ఎంతోకాలం బతకనని తెలుసుకొన్న మనోరంజన్.. తన బిడ్డను కలవాలనుకొంటాడు. తన చివరి సినిమా మార్గదర్శి దర్శకత్వంలోనేచేయాలని డిసైడ్ అవుతాడు. నిజ జీవితంలో మృత్యువుకు దగ్గరైన మనోరంజన్, సినిమాలోని సినిమాలోని మృత్యుంజయుడుగా నటిస్తాడు. మనోరంజన్ చివరి రోజులు ఎలా గడిచాయి.? మనో రంజన్ చివరి సినిమాగా ఉత్తమ విలన్ ఏమైంది? అనేదే ఈ చిత్ర కథ.
సినిమాలో సినిమా... ఈ సినిమా స్పెషాలిటీ. నిజ జీవితంతో మృత్యువుతో పోరాడుతున్న హీరో, తెరపై మృత్యుంజయుడిగా ఎలా కనిపించాడు, ఎలా నటించాడు, కథని ఎలా రక్తికట్టించాడు అనేదే ఉత్తమ విలన్. తన జీవితాన్ని, తన జీవితంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొంటూ, వృత్తిగత జీవితాన్ని కూడా సంతృప్తికరంగా ముగించాలని కలలుకన్న.. ఓ నటుడి జీవితం ఈ సినిమా. హీరో చనిపోతాడని తెలిసి చివరి రోజుల్లో ఎలా గడపాలనుకొన్నాడు? అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. ఉదాహరణకు మన తెలుగులో వచ్చిన `చక్రం`. అయితే దానికి సినిమా నేపథ్యాన్ని మేళవించి, సినిమాలో సినిమాని చూపించి.. తన మేధస్సుని వెండి తెరపై ఆవిష్కరించాడు కమల్ హాసన్.
నిజానికి ఇదో విషాదాంతమైన కథ. కథలోనే కావల్సినంత విషాదం ఉంది. కానీ.. ప్రేక్షకులు ఇంత విషాదాన్ని తట్టుకోలేరు. కాబట్టి.. దానికి ఉత్తమ విలన్ అనే మరో కథ యాడ్ చేశాడు. మనోరంజన్ ఏడిపిస్తుంటే - మధ్యమధ్యలో వచ్చిన ఉత్తమ విలన్ నవ్విస్తుంటాడు. ఈ రెండు కథలకూ ముడిపెట్టి కమల్ చాలా తెలివైన పని చేశాడు. గుండెలు పిండేసే ఓ సీన్, ఆ తరవాత... కొన్ని నవ్వులు. సినిమా అంతా ఇదే ఫార్మెట్లోకి తీసేశాడు కమల్. కమల్ దగ్గర వచ్చిన చిక్కేంటంటే ప్రతీదీ డిటైల్డ్‌గా చెప్పాలనుకొంటాడు. సింపుల్ సీన్‌ని తానే కాంప్లికేట్ చేసుకొని.. చిరిగి చాటయ్యేటంత తీస్తాడు. దాంతో ప్రతి సన్నివేశం నిమిషాల్లెక్కన సాగుతుంది. క్రమంగా సినిమా నిడివి పెరిగింది. ఏకంగా మూడు గంటల పాటు సాగింది. ఈ రోజుల్లో మూడు గంటలు థియేటర్లో కదలకుండా కూర్చోవాలంటే పెద్ద సమస్యే. పైగా ఇది పక్తు కమర్షియల్ సినిమా కాదు. ఓపిగ్గా రెండు కథల్ని వినాలి. ఏ ఒక్క కథకు కనెక్ట్ కాకపోయినా.. `మొదటి కథలో అంతకు ముందు ఏం జరిగింది?` అని బుర్ర గోక్కున్నా ఉత్తమ విలన్ కాస్త మనకు మరీ చెడ్డ విలన్ గా కనిపిస్తాడు. తొలి కథలో ఉన్న ఎమోషన్‌ని రెండో కథలో ఉన్న హ్యూమర్‌తో మర్చిపోగలిగితేనే రెండు కథలకూ బ్యాలెన్స్ కుదురుతుంది.
మృత్యుంజయుడు ఉత్తముడు కథని ఇంకాస్త బాగా తీర్చిదిద్దాల్సింది అనిపిస్తుంది. మనోరంజన్ జీవితానికీ, ఉత్తముడి కథకీ లింకులు వేసుకొంటూ స్ర్కీన్ ప్లే రాసుకొంటే ఉత్తమ విలన్ ఓ క్లాసిక్‌గా మిగిలిపోయేది. కానీ.. ఈ రెండు కథలూ వేర్వేరు. ఒక దానితో ఒకటి సంబంధం ఉండదు. దాంతో దేనికదే అయిపోయాయి. ఒక కథని వదిలేసి రెండో కథని మాత్రమే చూస్తే.. ఇది మరీ రొటీన్ మెలోడ్రామాలా ఉంటుంది. అందుకే రెండో కథని చెప్పడం అవస్యం అయ్యింది. బాలచందర్ కమల్‌కి గురువుగా నటించారు. వీళ్లిద్దరి గురించి సినీ ప్రపంచానికి తెలియంది కాదు. బాలచందర్ చివరి సినిమా కూడా ఇదే కావడంతో.. ఆడియన్స్ ఈ రెండు పాత్రలకూ బాగా కనెక్ట్ అవుతారు. కావాలని జోకులు వేయలేదుగానీ. కథలో అంతర్లీనంగా ఓ హ్యూమర్ ఉంది. అది కాస్త లైవ్లీగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా అక్కడక్కడ నవ్వులు పంచుతుంటుంది. చివరికి భారీ ఎమోషన్ సీన్లోనూ.. ఏదో ఓ జోకో, లేదంటే ఫన్ ఎలిమెంటో కనిపిస్తుంటుంది. అదీ.. కమల్ మార్క్‌తో.
ఉత్తమ విలన్ పర్‌ఫెక్ట్ కాస్టింగ్‌కి ప్రతీక. ఏ పాత్రనీ ఎవరూ తక్కువ చేయలేదు. కమల్ నటన గురించి కొత్తగా కితాబులిచ్చేదేముంది?? మిస్టర్ పర్‌ఫెక్ట్.. అన్నిటా తన పర్‌ఫెక్షనిజం చూపించాడు. ఉత్తముడు కంటే... మనోరంజన్ గానే ఎక్కువ మార్కులు అందుకొంటాడు. బాలచందర్ ని నటుడిగా చూడడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి. కె.విశ్వనాథ్ తనకు అలవాటైన బాణీలో చేసుకొంటూ వెళ్లిపోయారు. ఊర్వశి, నాజర్.. ఇలా హేమాహేమీలున్నారు. వాళ్లంతా ఓకే.
సాంకేతికంగానూ ఈసినిమా బాగున్నా.. గ్రాఫిక్స్ పేలవంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పులి కనిపించే సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితనం పేలవంగా ఉంది. రాజకోట కూడా బ్లూ మేట్‌లో తీసినట్టున్నారు. అదీ తెలిసిపోతోంది. జిబ్రాన్ సంగీతంలో వైవిధ్యం కనిపించింది. కమల్ గాయకుడిగానూ సత్తా చాటాడు. రమేష్ అరవింద్ కొన్ని చోట్ల మార్కులు అందుకొన్నాడు. ఇంకొన్ని చోట్ల దొరికిపోయాడు. ఉత్తముడు కథని ఇంకాస్త సమర్థంగా తెరకెక్కించాల్సింది. ఆ కథలో సీరియస్ నెస్ మరీ తక్కువైపోయింది.
కమల్ ఓ డిఫరెంట్ సినిమా అందించే ప్రయత్నం చేశాడు. కాకపోతే... ఈ సినిమాకి క్లాసిక్ చేయాలా, జనరంజకం చేయాలా? అనే సందిగ్థంలో ఎటూ కాకుండా వదిలేశాడు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్
రేటింగ్ 2.75