ప్రేమకథా చిత్రాల్లో `మరో చరిత్ర` సృష్టించింది!!
on Oct 22, 2018
స్వచ్ఛమైన ప్రేమకు కథా చిత్రానికి అచ్చమైన నిదర్శనం `మరో చరిత్ర`. అప్పటి వరకు సినిమా చరిత్ర ఒకలా ఉంటే బాలచందర్ `మరో చరిత్ర` సృష్టించాడు. నిజమైన ప్రేమ కు నిర్వచనం ఇస్తూ బ్లాక్ అండ్ వైట్ కాలంలో ప్రేమ కథా చిత్రాలకు కొత్త రంగును అద్దాడు. ఈ వయసులో కలిగేది ఆకర్షణ , వ్యామోహాలు తప్ప మీది ప్రేమ కాదంటూ పెద్దలు విడదీయాలని చూస్తారు. ఒక సంవత్సరం పాటు విడి విడిగా ఉండండి ఆ తర్వాత కూడా ఇదే ప్రేమ ఉంటే మీకు పెళ్ళి చేస్తాం అని పెద్దలు పె ట్టిన పరీక్షకు నిలిచి ...ప్రేమికులుగా గెలిచినా...కాలం చేతిలో ఓడిపోతారు. ఇంత బరువైన కథాంశంతో బాల చందర్ మరో చరిత్రగానే చిత్రాన్ని మలిచాడు. తన ప్రతిభకు ఓ మైలు రాయి ఈ చిత్రం.
మొదట ఈ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్స్ అనుకున్నాడట దర్శకుడు బాలచందర్. దాదాపు 169 మంది అమ్మాయిలను ఆడిషన్ చేశాడట. అయినా సంతృప్తి చెందలేదట దర్శకుడు. చివరకు నల్లగా ,బొద్దుగా పెద్ద పెద్ద కళ్లతో ఉండే సరితను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మొదట డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర యూనిట్ తో సహా సరిత హీరోయిన్ గా కరెక్ట్ కాదని అన్నా కూడా దర్శకుడు ఎవరి మాటను కేర్ చేయకుండా స్వప్న పాత్రకు తనే పర్ఫెక్ట్ యాప్ట్ అని సరితను తీసుకున్నాడట. సరిత కు మరో చరిత్ర తొలి సినిమా అయినా కూడా కమల్ హాసన్ కు పోటా పోటీగా నటించి మెప్పించింది.
ఒక బ్రాహ్మణ కుర్రాడికి ,బ్రాహ్మేతర అమ్మాయి కి మధ్య సాగే ఈ చిత్రం షూటింగ్ మొత్తం కూడా తొలి సారిగా వైజాగ్ లో పూర్తి చేసుకుంది. వైజాగ్ బీచ్, భీమిలీ, గాజువాక పరిసర ప్రాంతాల్లో ని అందాలను తెరకు పరిచయం చేసిన తొలి సినిమా `మరోచరిత్ర`నే. బాల చందర్ ఆ ప్రాంతాలు చూసిన వెంటనే ఇక్కడే మొత్తం షూటింగ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తో చెప్పారట. ఆ ప్రకారమై షూటింగ్ అంతా అక్కడే చేశారు. ఈ మూడు ప్రాంతాలను బాలచందర్ చూపించినంత అందంగా ఇంత వరకు ఎవరూ చూపించలేకపోయారని అంటుంటారు సినీ పండితులు.
అద్భుతమైన పాటలు, మాటలు, పిక్చరైజేషన్, కామెడీ, రొమాన్స్ ఆల్ ఎమోషన్స్ తో ఎంగేజ్ అయ్యేలా చేసాడు దర్శకుడు బాలచందర్. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుంటే అతుక్కుపోయే చూసే వారు కోకొల్లలు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమ ఉన్నంత కాలం సజీవంగానే ఉంటాయ.
1979 తెలుగులో రీలీజైన ఈ చిత్రం తమిళనాడులో కూడా తెలుగులోనే విడుదలైంది. రెండు చోట్ల దాదాపు సంవత్సరం పాటు మరో చరిత్ర ఆడింది. ఆ తర్వాత 1981 లో హిందీలో ఏక్ దుజే కే లియే పేరుతో కమల్ హాసన్ తో ఎల్ వి ప్రసాద్ నిర్మించారు. రతి అగ్ని హోత్రి హీరోయిన్ గా నటించింది. హిందీలో కూడా ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో అంత సక్సెస్ సాధించాయి. తెలుగు, హిందీ భాషల్లో పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడటం విశేషం. అలాగే కమల్ హాసన్ రెండు భాషల్లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు. మనసు పెట్టి సినిమా తీసినా, నటీనటులు నటించినా ఆ సినిమాలు ప్రేక్షకుల మనసులను తట్టి లేపుతాయని...చిరస్థాయిగా నిలిచిపోతాయని నిరూపించిన చిత్రం మరో చరిత్రం. ఇటీవల కాలంలో దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేసాడు కానీ, బోల్తా కొట్టింది. కొన్ని క్లాసిక్స్ ని కళ్లార్పి చూడాలే కానీ టచ్ చేయాలని ట్రై చేయవద్దు అని అందుకే అంటారేమో.