65లో 60 సినిమాకే... దటీజ్ కమల్ హాసన్!
on Nov 7, 2019
జీవితంలో సినిమాలు తప్ప మరొకటి తెలియదని చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులు చెబుతుంటారు. జీవితంలో సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవాడినో తెలియదని... మరో కెరీర్ గురించి ఆలోచించ లేదని అంటుంటారు. 'సినిమాయే తమ జీవితం, తమ జీవితమే సినిమా' అన్నట్టు చెబుతారు. అయితే సినిమాయే జీవితంగా బ్రతికిన ఏకైక వ్యక్తి కమల్ హాసన్.
ఇప్పుడు కమల్ హాసన్ కు 65 ఏళ్లు. అందులో 60 ఏళ్లు సినిమాయే శ్వాసగా, ఆశగా బ్రతికారు. ఇంతకుమించి జీవితాన్ని సినిమాకు రాసి ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఉంటారు చెప్పండి? 60 ఏళ్లుగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే నటుడు ఎవరు ఉన్నారు చెప్పండి? కొత్తదనం కోసం ప్రతిక్షణం పాకులాడిన ఫిల్మ్ మేకర్ ఎవరున్నారు చెప్పండి? కమల్ హాసన్ తప్ప మరో పేరు కనిపించదు. వినిపించదు.
పాఠశాలకు వెళ్ళవలసిన వయసులో సినిమాశాలకు వచ్చారు కమల్ హాసన్. పుస్తకాల్లో అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. నటుడిగా వయసుతోపాటు కమల్ హాసన్ పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. తనకు వస్తున్న పేరును చూసి కమల్ కాలర్ ఎగరేయలేదు. కొత్తగా ఇంకేం చేయగలను అని ఆలోచించారు. తనకు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నించలేదు. రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేయలేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు గౌరవం తెచ్చిన చిత్రాలు చేయాలనుకున్నారు. చేశారు.
మరోచరిత్ర, పుష్పకవిమానం, దశావతారం, భారతీయుడు, భామనే సత్యభామనే, సాగర సంగమం, విశ్వరూపం... ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ భారతీయ ప్రేక్షకులకు అందించిన ఆణిముత్యాలు ఎన్నో!
కథానాయకుడిగా కమల్ హాసన్ నటించిన సినిమాలు కొన్ని పరాజయం పాలై ఉండొచ్చు. కానీ, నటుడిగా ఎప్పుడు కమల్ హాసన్ ఫ్లాప్ కాలేదు. దర్శకుడిగా కమల్ హాసన్ తీసిన చిత్రాలు కొన్ని వసూళ్ల వేటలో వెనుకబడ్డ ఉండొచ్చు. కానీ, ఫిల్మ్ మేకర్ గా ఆయన ఎప్పుడూ వెనుకబడలేదు. సమకాలికులు కంటే ఒక అడుగు ముందున్నారు. ముందుండి ఆలోచించి సినిమాలు తీశారు. భావితరాలకు ఒక దిక్సూచిలా నిలిచారు. దటీజ్ కమల్ హాసన్. ఆయన్ను లోకనాయకుడు అనడంకంటే సినిమాకు నాయకుడు అంటే బాగుంటుందేమో. తెలుగువన్ డాట్ కామ్ తరపున కమల్ హాసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.