మహేష్ అలర్ట్ అయ్యాడు
on Jul 27, 2015
చిన్నదో, పెద్దదో సినిమా అనేసరికి పబ్లిసిటీ చాలా ముఖ్యం. మీడియాలో సినిమా పేరు ఎంత మార్మోగితే... అంత పబ్లిసిటీ గిట్టినట్టు. పబ్లిసిటీ వల్ల సినిమా రేంజు ఎంతలా మారుతుందో చెప్పడానికి బాహుబలి సినిమానే ఉదాహరణ. ఈ సినిమాని ముందు నుంచీ అంతర్జాతీయ సినిమా అన్నట్టు మీడియా ప్రమోట్ చేస్తూ వస్తోంది. దాంతో.. సినిమాకి ప్లస్సయ్యింది. భారీ వసూళ్లు చేజిక్కించుకొంది. ఇప్పుడు ఆ పబ్లిసిటీ మహత్తు.. మహేష్‌బాబుకీ బాగా తెలిసొచ్చింది. తన శ్రీమంతుడు సినిమా కూడా ఇలానే మీడియాలో నానాలని నానా పాట్లూ పడుతున్నాడు. మహేష్ ఎప్పుడూ మీడియాకు వీలైనంత దూరంలో ఉంటాడు. సినిమా హిట్టయితేనే గానీ ప్రెస్ మీట్లకు రాడు, ఇంటర్వ్యూలు ఇవ్వడు. కానీ... శ్రీమంతుడు విషయంలో మాత్రం మహేష్ ఎలర్ట్ అయ్యాడు. రిలీజ్ ఇంకా 20 రోజులున్నా.. ఇప్పుడే మీడియాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఇంగ్లీష్ మీడియాలో వరుసపెట్టి మహేష్ ఇంటర్వ్యూలు ప్రచురితమవుతున్నాయి. ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేయాలని ప్రొడ్యూసర్లకు కూడా మహేష్ సూచించాడట. శ్రీమంతుడు లాంటి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ అత్యవసరం. తొలి మూడు రోజుల్లో ఎంత దండుకొంటే అంత మంచిది. అందుకే.. ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేసి ఓపెనింగ్స్ రాబట్టుకోవాలనుకొంటున్నాడు మహేష్. మరి ఆ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.