బాహుబలివన్నీ బిల్డప్పులే..!
on Jul 10, 2015
ఇండియన్ అవతార్
మాయాబజార్ తరవాత మళ్లీ అలాంటి క్లాసిక్
ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్..
- ఆహా... ఇలాంటి బిల్డప్పులకేం తక్కువ చేయలేదు. టీమ్ లో ఎవరిని కదిపినా..
`ఇలాంటి సినిమా జీవితానికి ఒక్కసారేనండీ` అనేసేవారు. సినిమా గురించి ఏం మాట్లాడకుంటేనే అన్నో ఇన్నో ఊహించేసుకొని థియేటర్‌కెళ్తుంటారు జనాలు. ఇక మేమే క్లాసిక్ తీశామంటే ఇక ఆగుతారా?? హద్దులన్నీ చెరిపేసి మరీ ఊహించేసుకొంటారు. ఇవి చాలదన్నట్టు అమితాబ్ నుంచి సల్మాన్ ఖాన్ వరకూ, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బాహుబలిని పొగడని వాడెవ్వడూ లేడు. సినిమా రాకముందే.. 'అద్భుతం.. క్లాసిక్' అని పనిగట్టుకొని మరీ కితాబులిచ్చేశారు. తీరా చూస్తే... బాహుబలి `జస్ట్ ఓకే` సినిమా అనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూడేళ్లు కష్టపడింది, వందల కోట్లు వచ్చించింది ఇందుకా..? అనిపిస్తోందిప్పుడు..
బాహుబలిని ఇప్పటి కిప్పుడు పోస్ట్ మార్టం చేస్తే.. బోలెడన్ని అవలక్షణాలు పుట్టగొడుగుల్లా బయటకు వచ్చేస్తాయి. ముఖ్యంగా కథారచయిత విజయేంద్ర ప్రసాద్ రాసింది.. ఓ మామూలు కమర్షియల్ కథ. దానికి భారీ హంగులు జోడించాడంతే. ఇంత సినిమా తీసినా, ఇండియన్ అవతార్ అని చెప్పుకొన్నా.. మామూలు కమర్షియల్ అంశాల్ని ఏమాత్రం మర్చిపోకుండా ఎడా పెడా వాడేసుకొన్నాడు రాజమౌళి. మధ్యలో ఇరికించిన ఐటెమ్ పాటే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఫస్టాఫ్‌లో అవంతిక తన తనువును శివుడికి అప్పగించేసే సీన్... పక్కా కమర్షియాలిటీ. అసలు అవంతిక ఎవరు? ఓ గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్న వీరనారి. ఓ మగాడు తనకు తెలియకుండా చేతిపై పచ్చబొట్టు వేస్తే.. దానికి కడివెడు కన్నీళ్లు పెట్టుకొన్న ఓ వీరనారి... ప్రేమిస్తున్నా అంటూ వెంటపడిన అబ్బాయికి తన `సర్వస్వం` క్షణాల్లో అర్పించేస్తుంది. అక్కడ అవంతిక పాత్ర ఔచిత్యం ఎక్కడికి పోయింది..??
భల్లాలదేవకిచ్చిన బిల్డప్పులు అన్నీ ఇన్నీ కావు. `అసలు ఇండియన్ స్ర్కీన్ పైనే ఇంత పెద్ద విలన్ ని చూడలేదు..` అన్నారు. అసలు ఈ సినిమాలో విజనిజం ఎక్కడుందని? కాలకేళగా కనిపించిన ప్రభాకరే కదా అసలు విలన్. నాజర్ పాత్రని సరిగ్గా వాడుకొన్నాడా? కట్టప్ప పాత్రని ఎందుకలా డమ్మీగా మార్చారు? అసలు సుదీప్ క్యారెక్టర్ ఈ సినిమాకి అవసరమా? కన్నడలో ఈ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి తప్ప...?? అనుష్క కోసం ఈ సినిమాకి వెళ్తే నిరాశపడడం మాత్రం ఖాయం. ఆ మేకప్ కథకు అవసరమే కావచ్చు.. కానీ భరించలేం. అనుష్క ఈ సినిమా ప్రమోషన్లకు ఎందుకు ఎగ్గొట్టేసిందో దేవసేన పాత్రని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో మాకు ఎనర్జీ ఇచ్చిన పాత్ర ఏదైనా ఉంటే.. అది శివగామి పాత్రే అన్నారంతా. కానీ అంత సీన్ ఆ పాత్రకు లేకుండా పోయింది. రమ్యకృష్ణ నటనలో పీక్స్ చూడాలంటే నరసింహ సినిమానే. అందులోని నటనతో పోలిస్తే.. శివగామి ఎంతని..?? ఇలా ఒక్కటని కాదు.. ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర హాఫ్ బాయిల్డే.
ఈ సినిమాకి ప్రధానమైన ప్రాణం... యుద్ద సన్నివేశాలు. ఈ సీన్స్‌కి వంద రోజుల పాటు, యాభై కోట్ల ఖర్చుతో తెరకెక్కించారట. వార్ ప్లాన్స్, ఈ సీన్లకు ఇచ్చిన ముందస్తు బిల్డప్పులు ఇవన్నీ బాగానే ఉన్నాయి. వార్ సీన్‌లో కొన్ని షాట్స్ అద్భుతం అనిపిస్తాయి. కానీ.. రాన్రానూ ఈ వార్ ఎప్పుడు అయిపోతుంది రాబాబూ అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో మహిష్మతీ సామ్యాజ్యాన్ని సృష్టించారు. ఓకే. అయితే ఆ సామ్రాజ్యం తొలిసారి చూసిన ఫీలింగ్ ప్రతిసారీ కలగదు. తెరపై ఏది విజువల్ ఎఫెక్ట్స్ ఏది కాదో ప్రేక్షకుడు సులభంగా ఓ అంచనాకు వచ్చేస్తున్నాడు. అలాంటప్పుడు అవేం పెద్దగా థ్రిల్ కలిగించదు. అడవి దున్నతో రానా చేసిన ఫైట్.. చాలా మామూలుగా ఉంది. అది వీ ఎఫ్ సీన్ అని తెరపై రాసేశారు...దాంతో కలిగిన కాస్త ఫీల్ కూడా ఎగిరిపోతుంది. జానపద, పౌరాణిక చిత్రాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. కత్తి యుద్దాలు ఎన్టీఆర్, కాంతారావు హయాంలోనే తీశారు. రాజకోట రహస్యం లాంటి సినిమాల్ని ఇప్పుడు చూసినా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అవన్నీ రోజుల్లో తీసిన సినిమాలు. ఈ సినిమాలో ఒక్క యుద్ద సన్నివేశానికే 100 రోజులు కేటాయించారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పెరిగాయి. అలాంటప్పుడు వార్ ఎపిసోడ్ మరో రేంజులో ఉండాలి. కానీ.. ఆ విషయంలోనూ ఈ సినిమా నిరాశపరిచింది.
ఈ సినిమాకి ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ హైపే... ఇప్పుడు ఆ హైపే బాహుబలి కొంప ముంచింది. మగధీర, ఈగ వచ్చినప్పుడు ఇంత హైప్ లేదు. అసలు ఆయా సినిమాల గురించి రాజమౌళి ఎప్పడూ పెదవి విప్పలేదు. అందుకే మగధీరలో వంద మందిని చంపే ఎపిసోడ్ చూసి షాక్ తిన్నారు జనాలు. అందులోని ఎఫెక్ట్స్ చూసి వారెవా అనుకొన్నారు. ఈగ కూడా అంతే. అయితే బాహుబలి అలా కాదు. ముందే.. క్లాసిక్ క్లాసిక్ అంటూ కాకి కూతలు కూశారు. దాంతో ఆశలు పెరిగాయి. ఇప్పుడు తెరపై బొమ్మ చూసి ప్రేక్షకుడికి దిమ్మ తిరిగిపోతోంది.