గెలుపు రాజేంద్రప్రసాద్‌దేనా??
on Apr 7, 2015
'మా' ఎన్నికలకు సంబంధిచిన కీలక తీర్పును న్యాయస్థానం రేపు (మంగళవారం) వెలువరించనుంది. 'మా' అధ్యక్ష్య పీఠం కోసం అటు రాజేంద్రప్రసాద్, ఇటు జయసుధ హోరా హోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసినా కౌంటింగ్ ఆపాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. 7వ తేదీన కౌంటింగ్‌కి సంబధించిన అనుమతి న్యాయ స్థానం జారీ చేసే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో కౌంటిగ్ కూడా ముగియనుంది. ఈలోగా `మా` పీఠం అధిష్టించేవాళ్లు ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు జయసుధదే ఈ స్థానం అని ధీమాగా చెప్పినవాళ్లు కూడా.. ఇప్పుడు ఆమె గెలుపుపై సందేహాలు వ్యక్తపరుస్తున్నారట. రాజేంద్ర ప్రసాద్ గట్టి పోటీ ఇచ్చారని, ఆయనపై సానుభూతి పవననాలు వీచాయని, ఈసారి ఆయన గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పరిశ్రమ నుంచి నటకిరీటికి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. దానికి తోడు జయసుధకు దాసరి వర్గం అండ ఉంది. అందుకే ఈసారీ రాజేంద్ర ప్రసాద్ ఓటమి తప్పదనుకొన్నారంతా. గతంలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నటకిరీటికి ఈసారి ఘోర పరాభవం తప్పదని చెప్పుకొన్నారు. అయితే.. ఎన్నికల సరళి చూశాక.. రాజేంద్రప్రసాద్‌కీ గెలిచే అవకాశాలున్నాయని, ఆ మాటకొస్తే ఈసారి గెలుపు ఆయనదే అని కొంతమంది బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చివరి క్షణాల్లో అల్లరి నరేష్.. నటకిరీటి కోసం గట్టిగా పనిచేశాడట. నరేష్‌కి యూత్ హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ స్నేహం కొద్దీ.. నరేష్ చెప్పినట్టు రాజేంద్రప్రసాద్‌కి ఓట్లు గుద్దేశారని తెలుస్తోంది. అంతేకాదు.. రెండు దఫాలుగా మా అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ ఏం చేయలేదని, ఆయనపై ఉన్న వ్యతిరేకత జయసుధపై పడిందని చెప్పుకొంటున్నారు. ఇంకెంత.. రెండు మూడు రోజులు ఆగితే ఈ సస్పెన్స్‌కి తెర పడడం ఖాయం. గెలుపు ఎవరితో తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతుంది.