నటకిరీటి... లేటెస్ట్ కిరికిరి...
on Apr 22, 2015
'మా' అధ్యక్షపీఠం ఎక్కి ఇంకా రెండ్రోజులు కాలేదు.. అప్పుడే - నటకిరీటి రాజేంద్రప్రసాద్‌పై నిరసన జ్వాలలు మొదలైపోయాయి. రాజేంద్ర ప్రసాద్ హుందాగా ప్రవర్తించడం లేదని, ఆయన ఒంటెద్దుపోకడ 'మా' కి తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం ఉందని కొంతమంది 'మా' సభ్యులు, ప్యానల్ మెంబర్లు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసిన విషయం విదితమే. 'మా' అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని కలుసుకొన్న రాజేంద్రప్రసాద్.. దాన్నో పర్సనల్ విజిట్‌గా తీసుకొన్నారని, 'మా' ప్యానల్ అంటే మిగిలిన 22మందీ అని, కేవలం ఆయన ప్యానల్‌లోని నలుగురిని మాత్రమే వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సీనియర్ నటీనటులు. చిరంజీవిని కలుసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలో చిరంజీవి సీనియర్ నటుడే కానీ.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సీనియర్లు కాదా, పరిశ్రమకు పెద్దదిక్కు అయిన దాసరి నారాయణరావు అంటే ఖాతరు లేదా?? అంటూ నటకిరీటిపై విమర్శనాస్త్రాలు సంధించడానికి కొంతమంది నటీనటులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తన దైవం అని చెప్పుకొనే రాజేంద్రప్రసాద్... ఆయన వారసుల్ని మర్చిపోవడం ఆశ్చర్యంగా ఉందని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరి వీటిని నటకిరీటి ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.