నవరసభీముడు మా రాజేంద్రుడు
on Jul 19, 2016
"రాజేంద్రప్రసాద్" అనే పేరు వినగానే మనకి తెలియకుండానే మన పెదాలపై చిన్న నవ్వు నాట్యం చేస్తుంది. ఒక నటుడిగా ఆయన సాధించిన ఘన కీర్తికి ఆ నవ్వే నిదర్శనం. అయితే.. రాజేంద్రప్రసాద్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సినిమాలు "ఏప్రిల్ ఒకటి విడుదల, పెళ్లి పుస్తకం, లేడీస్ టైలర్, ఆహా నా పెళ్లంట, ఆ ఒక్కటీ అడక్కు, ఆ నలుగురు, జులాయి". అయితే.. ఈ సినిమాలన్నీట్లో రాజేంద్రుడు నటించాడు అంతే. కానీ.. ఆయన జీవించిన పాత్రలు కొన్ని ఉన్నాయి. కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ.. రాజేంద్రప్రసాద్ అనే పేరును ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ఆ సినిమాల గురించి నేడు (జూలై 19) రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుకొందాం...
చాలెంజ్: ఈ సినిమాలో "విద్యార్ధి" అనే పాత్రలో రాజేంద్రప్రసాద్ కనబరిచిన నటన అద్భుతం. తన మేధాశక్తి మీద అపార నమ్మకంతోపాటు గాంధీ పాత్రధారి చిరంజీవిపట్ల అమితమైన గౌరవం చూపించే విద్యార్ధి పాత్ర "చాలెంజ్" సినిమాకి చాలా కీలకం.
కాష్మోరా: అప్పటివరకూ సపోర్టింగ్ రోల్స్, పాజిటివ్ క్యారెక్య్తర్స్ చేస్తూ వచ్చిన రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా "ధార్కా" పాత్రలో మంత్రతంత్రాల ఉపాసకుడిగా కనిపించిన తీరు ప్రేక్షకులను భయపెట్టింది. రాజశేఖర్, శరత్ బాబు వంటి సీనియర్ స్టార్లు ఉన్నప్పటికీ.. "కాష్మోరా" సినిమాలో నటుడిగా తన మార్క్ వేయగలిగాడు రాజేంద్రప్రసాద్
సంసారం ఒక చదరంగం: అప్పుడప్పుడే ఆర్టిస్ట్ గా రాజేంద్రప్రసాద్ కు గుర్తింపు లభిస్తున్న తరుణం హీరోగానూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ.. కథ నచ్చడంతో కీలకపాత్ర కానప్పటికీ శరత్ బాబుకి తమ్ముడిగా నటించడానికి ఒప్పుకొన్నాడు రాజేంద్రప్రసాద్. ఈ సినిమాలో తండ్రి మాట తప్పని తనయుడిగా, భార్య కోరిక తీర్చడానికి ఇబ్బందిపడే మధ్యతరగతి భర్తగా రాజేంద్రప్రసాద్ నటన అందరి మనసుల్లో నిలిచిపోయింది.
మదనగోపాలుడు: బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక కుర్రాడు సిటీకి చదువుకోవడానికి వచ్చి.. తనలోని కామాన్ని అణుచుకోలేక ఆఖరికి తల్లి చనిపోయినప్పుడు కూడా ఎవరితోనో శృంగారంలో మునిగితేలుతుంటాడు. ఈ సినిమా చూసిన తర్వాత రాజేంద్రప్రసాద్ ను చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఈసడించుకొన్నారు. ఒక నటుడిగా రాజేంద్రప్రసాద్ ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది.
ముత్యమంత ముద్ధు: అప్పటికే యండమూరి వీరేంధ్రనాధ్ రాసిన "థ్రిల్లర్" అనే నవల తెలుగు పుస్తకాపాఠకులందరికీ విపరీతంగా నచ్చేసింది. ఈ సాహిత్యాభిమానిని అడిగినా ఆ నవల గురించే మాట్లాడేవాడు. ఆ నవలను సినిమాగా తీద్దామనుకొన్నప్పుడు దర్శకుడు రవిరాజా పెనిశెట్టికి గుర్తొచ్చిన ఏకైక నటుడు రాజేంద్రప్రసాద్. ఈ సినిమాలో "ప్రేమ" అని పదానికి ఇచ్చినట్లుగా అందమైన, స్వచ్చమైన, అర్ధవంతమైన నిర్వచనం బహుశా ఇప్పటివరకూ మాత్రమే కాదు ఇకపై కూడా ఎవ్వరూ ఇవ్వలేరేమో. ఈ సినిమాలో ప్రేమ కోసం తపస్సు చేసిన వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ నాటన చూస్తే.. నిజంగానే తపస్సు చేసొచ్చాడేమో అని ప్రేక్షకుడు నమ్మే స్థాయిలో సెటిల్ఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు రాజేంద్రప్రసాద్. ముఖ్యంగా.. "ప్రేమ కంటే కామమే గొప్పది" అని ఒక ఆడపిల్ల రాజేంద్రప్రసాద్ కు ప్రూవ్ చేయాలనుకొని నగ్నంగా.. తన యడకు హత్తుకొన్నప్పుడు "మా అమ్మ గుర్తొచ్చింది" అని రాజేంద్రప్రసాద్ కన్నతల్లిని తలచుకొనే సన్నివేశం చూసినవారికి కళ్ళు చెమర్చకుండా ఉండవు. రాజేంద్రుడు నట ప్రతిభకు పట్టం కట్టిన చిత్రమిది.
ప్రేమ తపస్సు: మనం "శివపుత్రుడు" సినిమాలో విక్రమ్ నటన చూసి "వహ్వా" అంటుంటాం. కానీ.. "ప్రేమ తపస్సు" సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా దాదాపుగా అదే స్థాయిలో నటించాడు. కాదు కాదు జీవించాడు. స్వచ్చమైన ప్రేమ కోసం ఆరాటపడే వ్యక్తిగా రాజేంద్రుడి నటన కోసమే సినిమాను ఎన్ని సార్లైనా చూడొచ్చు.
సీతాపతి ఛలో తిరుపతి: ఊహాతెలిసినప్పట్నుంచి ఇష్టపడని మరడలిని పెళ్లాడడం కోసం తిరుపతి పారిపోయి తనకు అలవాటి లేని మంగళి పని చేసుకొనే కుర్రాడిగా రాజేంద్రప్రసాద్ పంచిన నవ్వులు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి.
మాయలోడు: రాజేంద్రప్రసాద్ ను సూపర్ స్టార్ ను చేసేసిన సినిమా ఇది. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పిల్లలు-పెద్దలను కూడా అలరించి సూపర్ హిట్ అవ్వడంతోపాటు రాజేంద్రప్రసాద్ కు స్టార్ డమ్ తీసుకువచ్చింది.
రాంబంటు: హీరోగా సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న రాజేంద్రప్రసాద్ నిర్మాతగా మారి బాపు దర్శకత్వంలో నిర్మించిన సినిమా "రాంబంటు". సినిమా ఫ్లాపయినా.. సినిమాలోని కైకాల-రాజేంద్రప్రసాద్ ల కాంబినేషన్ సీన్లు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి.
హిట్లర్: హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక రాజేంద్రప్రసాద్ మళ్ళీ క్యారెక్టర్ రోల్ చేసిన సినిమా "హిట్లర్". అప్పటికి వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న చిరంజీవికి సూపర్ సక్సెస్ తెచ్చిపెట్టిన ఈ చిత్రం రాజేంద్రప్రసాద్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నవ్విస్తూనే సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టించాడు.
ఫ్యామిలీ సర్కస్: ఈ సినిమాలో రౌడీ పెళ్ళాం ఝాన్సీ చెప్పిన మాట జవదాటడమే కాదు, అల్లరి పిల్లలు చేసే విపరీత చేష్టలను కూడా భరిస్తూ సీరియస్ గా కనిపించే రాజేంద్రప్రసాద్ ను చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు.