ఆయన కూడా రాజేంద్రుని అభిమానే తెలుసా?
on Jul 18, 2018
రాజేంద్రప్రసాద్ ని అందరూ నటకిరీటి అంటారు. కొందరైతే.. హాస్యేంద్రుడు అని కూడా అంటారు. ఈ రెంటిలో ఏది కరెక్ట్ అనడిగితే... నటకిరీటి అనే బిరుదే.. సరైందంటాను. ఎందుకంటే.. రాజేంద్రుడు నవ్వించడంలోనే కాదండోయ్.. ఏడిపించడంలో కూడా మాస్టరే. ఆ మాటకొస్తే నవరసాలూ అద్భుతంగా పలికించగల నటుడు మన రాజేంద్రుడు. రాజేంద్రప్రసాద్ అనగానే.. ముందు చెప్పుకోవల్సింది టైమింగ్. ఆయన జనరేషన్‌లో అంత టైమింగ్ ఉన్న నటుడు మరొకరు లేరని నిర్భయంగా చెప్పొచ్చు. అందుకే... అన్ని రసాల్లో కష్టతరమైన హాస్య రసాన్ని అలవోకగా పలించేస్తుంటాడు రాజేంద్రప్రసాద్.
రాజేంద్రుడు అంటే కామెడీ.. కామెడీ అంటే రాజేంద్రుడు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. తెరపై ఆయన నవ్వులు పూయించిన సినిమాలు కోకొల్లలు. ప్రేమించుపెళ్లాడు, అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు, లేడీస్ టైలర్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, జూలకటక, రెండురెళ్లు ఆరు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్.. ఇలా చెప్పుకుంటూ పోతే... ఒకటారెండా! ముఖ్యంగా 80ల్లో 90ల్లో చెలరేగిపోయి నటించారాయన. కేవలం ఒకే జానర్‌కి రాజేంద్రప్రసాద్ పరిమితం కాలేదండోయ్. ఆయన నటించిన కాష్మోరా హారర్ ధ్రిల్లర్. అందులో ఆయన చేసిన ఖాద్రా పాత్ర... అప్పటి ప్రేక్షకులకు బ్లడ్ ప్రషర్ పెంచేసింది. ఎర్రమందారంలో చేసిన రాముడి పాత్రయితే.. ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేసింది. ఇవేగాక.. పవిత్ర, పుణ్యశ్రీ, సంసారం ఒక చదరంగం..
ఇలా కొన్ని సినిమాలున్నాయ్. వాటిలో కొత్త రాజేంద్రప్రసాద్ కనిపిస్తాడు. రాజేంద్రప్రసాద్ కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాలు ముత్యమంతముద్దు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం. ఇలా రకరకాల సినిమాలు చేశాడు కాబట్టే.. ఆయన నటకిరీటి. విజయావారి సినిమాలను ఎలాగైతే అందరూ కచ్చితంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటారో... కొనుక్కొని దాచుకుంటారో.. అలాగే రాజేంద్రప్రసాద్ సినిమాలను కూడా చాలామంది దాచుకుంటారు. ఎందుకంటే.. మనసు బాగోనప్పుడు రాజేంద్రప్రసాద్ సినిమా ఒకటి చూస్తే చాలు రీఫ్రెష్ అయిపోతాం.
అంతెందుకండీ.. మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కూడా రాజేంద్రప్రసాద్ అభిమాని అన్న విషయం ఎందరికి తెలుసు చెప్పండి. ఆయనే స్వయంగా ఆ విషయాన్ని తను రాసుకున్న స్వీయ చరిత్ర ఇన్‌సైడర్‌లో క్లియర్‌గా రాసుకున్నారు. టోటల్‌గా చెప్పేదేంటంటే.. చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, వెంకటేశ్ ఫ్యాన్స్.. వీరందరూ రాజేంద్రప్రసాద్ ఫ్యాన్స్. దటీజ్ రాజేంద్రప్రసాద్.
హీరోగా దాదాపు రెండొందల సినిమాల్లో నటించిన రాజేంద్రప్రసాద్... ఇప్పుడు కేరక్టర్ నటునిగా కొత్త జర్నీ మొదలుపెట్టారు. ఈ ఇన్నింగ్స్ కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారాయన. ఈ రోజు రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు. ఇలాగే పది కాలాలపాటు సంబరంగా ఆయన జీవితం సాగాలని ఆశిస్తుంది తెలుగువన్.