కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ
on Aug 23, 2019
చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి
తారాగణం: ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, ఝాన్సీ, కార్తీక్ రాజు, శివ కార్తికేయన్, మహేశ్, వెన్నెల కిశోర్, భీమనేని శ్రీనివాసరావు
సంభాషణలు: హనుమాన్ చౌదరి
సంగీతం: దిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: బి. ఆండ్రూ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: కె.ఎ. వల్లభ
బేనర్: క్రియేటివ్ కమర్షియల్స్
విడుదల తేదీ: 23 ఆగస్ట్ 2019
తమిళంలో హీరో శివ కార్తికేయన్ నిర్మించగా హిట్టయిన 'కణా' సినిమాకు రీమేక్ 'కౌసల్య కృష్ణమూర్తి'. ఒరిజినల్‌లో నాయికగా నటించిన ఐశ్వర్యా రాజేశ్ తెలుగులోనూ అదే పాత్ర చేసింది. 'మల్లెమొగ్గలు' రాజేశ్ కూతురైన ఐశ్వర్య నేరుగా తెలుగులో నటించిన తొలి సినిమా ఇదే. రీమేక్ కింగ్‌గా పేరుపొందిన భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. అయితే బిజినెస్ కాకపోవడంతో విడదలలో జాప్యం జరిగి ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
ఇరగవరంలో రైతు అయిన కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్)కి క్రికెట్ అంటే పిచ్చి. ఎంత పిచ్చంటే తండ్రి చనిపోయి ఇంటి ముందు ఆ పాడె ఉండగానే ఇంట్లోకి వచ్చి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేంత! వరల్డ్ కప్‌లో ఇండియా ఓడిపోతే ఏడ్చిన తండ్రిని చూసి, చిన్నపిల్లైన ఆయన కూతురు కౌసల్య ఎప్పటికైనా క్రికెటరై, వరల్డ్ కప్‌ను సాధించి తండ్రి కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటుంది. ఆ ఊళ్లో వేరే ఆడపిల్లలెవరూ క్రికెట్ ఆడకపోయినా మగపిల్లలతోటే క్రికెట్ ఆడి, ప్రాక్టీస్ చేస్తుంది. తల్లి (ఝాన్సీ) ఎంత వ్యతిరేకిస్తున్నా, తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా మారుతుంది కౌసల్య (ఐశ్వర్యా రాజేశ్). స్టేట్ లెవల్లో ప్రతిభ చూపి నేషనల్ టీంకు సెలక్టవుతుంది. మరోవైపు కృష్ణమూర్తి పొలం ఎండిపోవడంతో బ్యాంక్ నుంచి తెచ్చిన రుణం తీర్చలేకపోతాడు. అతని ఇంటిని బ్యాంకు వాళ్లు జప్తు చేస్తారు. వరల్డ్ కప్‌లో ఇండియా తరపున ఆడే అవకాశం దక్కించుకున్న కౌసల్యకు ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు కౌసల్య ఏం చేసింది? తండ్రి కళ్లల్లో ఆనందం నింపాలనుకున్న ఆమె ఆశయం నెరవేరిందా? లేదా?.. అనే విషయాలు పతాక సన్నివేశాల్లో తెలుస్తాయి.
అనాలిసిస్:
ఒరిజినల్ తమిళ 'కణా'కు ఎక్కువ మార్పులు, చేర్పులు లేకుండా, కథ 'ఆత్మ'ను డీవియేట్ చేయకుండా నిజాయితీగా 'కౌసల్య కృష్ణమూర్తి'ని రూపొందించాడు దర్శకుడు భీమనేని. ఎలాంటి దాపరికాలు లేకుండా స్ట్రెయిట్ నెరేషన్‌తో కథలోకి తీసుకెళ్లాడు. కృష్ణమూర్తి, ఆయన కూతురు కౌసల్య పాత్రల పరిచయం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, క్రమంగా వాళ్ల కథను ఆసక్తికరంగా మలచడంలో సఫలమయ్యాడు. అందుకే ఫస్టాఫ్‌లో ఒకట్రెండు మినహా పెద్దగా మెరుపులు కనిపించవు. కౌసల్యకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం ఏర్పడటాన్నీ, క్రికెటర్‌గా కప్పు గెలిచి తండ్రిని సంతోషపెట్టాలన్న బలీయమైన కోరిక కలగడాన్నీ ఈ ఫస్టాఫ్‌లో బిల్డప్ చేశారు. కృష్ణమూర్తి క్రికెట్ పిచ్చి చూస్తుంటే, మనలోని క్రికెట్ పిచ్చిని తెరమీద చూసుకున్నట్లు ఉంటుంది. అందుకే కృష్ణమూర్తి పాత్రతో అనేకమంది సహానుభూతి చెందుతారు.
అలాంటి తండ్రిని చిన్నప్పట్నుంచి చూస్తూ, ఆ తండ్రి ఇష్టాన్నే తన ఇష్టంగా చేసుకున్న కౌసల్య మగపిల్లల నుంచి క్రికెట్ నేర్చుకుంటుంది. ఆమె 'పెద్దమనిషి' అయ్యాక తల్లి బయటకు వెళ్లకుండా కట్టడిచెయ్యాలని చూడ్డం సహజంగా అనిపిస్తుంది. మగపిల్లలతో కలిసిపోయి మగరాయుడిలా ఆడుతోందంటూ ఇరుగుపొరుగు అమ్మలక్కలు సూటిపోటి మాటలు అంటే కూతురి క్షేమం కోసం ఆ తల్లి తల్లడిల్లటం న్యాయం. ఆ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. ఆ మగపిల్లలంతా కౌసల్యను చెల్లిలిగా భావించి ఆమెకు సపోర్ట్ చెయ్యడం బాగుంది. వాళలో ఎవరూ ఆమెపై వికృత చేష్టలకు పాల్పడకపోవడం రిలీఫ్‌నిస్తుంది. బయటి ఆటగాడొకడు ఆమెను నీచంగా మాట్లాడితే, ఆమెను మూగగా ఆరాధించే సాయికృష్ణ (కార్తీక్ రాజు) అతడిపై దాడి చెయ్యడం సరైన పనే. ఆ సందర్భంగా ఇరు పక్షాల మధ్య గొడవలు జరిగి, అది పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, అవతలి పక్షం వాళ్లు.. ఆడపిల్ల క్రికెటర్ దుస్తుల్లో అలా కనిపిస్తే మగవాళ్లు చూడకుండా ఎలా ఉంటారు, కామెంట్లు చెయ్యకుండా ఎలా ఉంటారని ఎగతాళిగా మాట్లాడతారు. అది.. చూసే చూపులో ఉంటుందనీ, తన కూతురు క్రికెటర్‌గా పేరు తెచ్చుకొని ఊరికీ, దేశానికీ పేరు తెస్తుందనీ కృష్ణమూర్తి చెప్పే మాటలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఈ ఎపిసోడ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా వెన్నెల కిశోర్ కేస్టింగ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి.
ఒక వైపు కౌసల్య క్రికెటర్‌గా నేషనల్స్‌కు, ఆ పై వరల్డ్ కప్ టీంకు ఎంపికవడంలో ఎదుర్కొనే కష్టాలు, ఆటుపోట్లు, మరోవైపు రైతుగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి, అప్పులపాలై, ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుందామనుకొనే స్థితికి కృష్ణమూర్తి రావడం, అతని ఇంటిని బ్యాకువాళ్లు జప్తు చేయడం.. సమాంతరంగా నడిచి మన హృదయాల్ని పిండేస్తాయి. తమ తమ రంగాల్లో ఆ తండ్రీకూతుళ్లు పడే అవస్థలు చూసి కరిగిపోతాం. కౌసల్య కష్టాల్ని తీర్చడానికి నెల్సన్ (శివ కార్తికేయన్) వస్తే, కృష్ణమూర్తి కష్టాల్ని తొలగించడానికి ఎవరొస్తారు? రైతును ఆదుకొనే నాథుడెవరు? క్లైమాక్స్‌లో కృష్ణమూర్తి ఆనందపరవశుడవుతాడు. గర్వపడతాడు. ఎందుకు? అది మనం తెరపైనే చూడాలి. నిర్మాణ విలువలు మరింత నాణ్యంగా ఉంటే, సినిమా ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండేది.
ప్లస్ పాయింట్స్:
రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేశ్, ఝాన్సీ నటన
తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం
కౌసల్య, కృష్ణమూర్తి పాత్రల్లోని భావోద్వేగాలు
ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ నెరేషన్ స్లోగా ఉండటం
కమర్షియల్ విలువలు లోపించడం
నిర్మాణ విలువలు నాణ్యంగా లేకపోవడం
నటీనటుల అభినయం:
'కౌసల్య కృష్ణమూర్తి' బలమంతా నటీనటుల అభినయంలోనే ఉందని చెప్పాలి. కృష్ణమూర్తి, కౌసల్య పాత్రల్లో రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేశ్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకూ రాజేంద్రప్రసాద్ చేసిన ఉత్తమ స్థాయి పాత్రల్లో కృష్ణమూర్తి పాత్ర నిస్సందేహంగా ఒకటి. అలాగే ఆయన అత్యుత్తమ స్థాయి అభినయాల్లో ఇది ముందు వరుసలో నిలుస్తుంది. కౌసల్యకు మొదట్నుంచీ సపోర్ట్‌గా నిల్చొని, ఊరివాళ్లను కూడా ధిక్కరించి, క్రికెటర్‌గా కూతురి అభ్యున్నత్తిని కోరుకున్న తండ్రిగా, మనదేశంలో వ్యవసాయాన్ని నమ్ముకొని, అప్పులపాలై, సర్వం పోగొట్టుకున్న రైతులకు ప్రతినిధిగా రెండు పార్శ్వాలున్న కృష్ణమూర్తి పాత్రను హృదయాల్ని కలచివేసేలా ఆయన పోషించారు.
కౌసల్యగా ఐశ్వర్య ఆ పాత్రను పోషించిందని చెప్పడం కంటే ఆ పాత్రలా ప్రవర్తించిందనడం కరెక్ట్. మనకు తెరపై కౌసల్యే కనిపిస్తుంది కానీ, ఐశ్వర్య కనిపించదు. ఆ కేరెక్టర్‌లోని నిజాయితీని, అమాయకత్వాన్ని, భావోద్వేగాల్ని, బాధని అపూర్వమనదగ్గ స్థాయిలో ప్రదర్శించింది. క్లైమాక్స్‌లో ఐశ్వర్య చెప్పిన మాటలు సినిమాకే ఆయువుపట్టు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చాననే ఆనందం ఒకవైపూ, ఒక రైతుగా సర్వం కోల్పోయి నడిరోడ్డుపై తండ్రి నిల్చున్నాడనే బాధ మరోవైపూ కమ్ముకోగా ఆమె ప్రదర్శించిన హావభావాలు, చెప్పిన మాటలు మనిషి అన్నవాడినెవరినైనా కదిలిస్తాయి.
సినిమాలో ఇంకో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కౌసల్య తల్లిగా నటించిన ఝాన్సీది. మొదట మగరాయుడిలా క్రికెట్ ఆడటానికి వెళ్తున్నదన్న భావనతో కూతుర్ని కట్టడి చేయాలని ప్రయత్నించే సగటు తల్లిలా, తర్వాత ఆ కూతురి ఆశయంలోని నిజాయితీని తెలుసుకొని ప్రోత్సహించిన అమ్మలా ఝాన్సీ ఉత్తమ స్థాయి నటనను ప్రదర్శించారు. కౌసల్యను మూగగా ఆరాధించే పాత్రలో కార్తీక్ రాజు, అతడి స్నేహితుడిగా మహేశ్, సెకండాఫ్‌లో కనిపించే క్రికెట్ కోచ్‌గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, కృష్ణమూర్తి స్నేహితుడిగా సీవీఎల్ నరసింహారావు, ఫస్టాఫ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నవ్వించే వెన్నెల కిశోర్ తమ పాత్రల్ని పండించారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు సైతం రైతుల్ని రుణాలు కట్టమని పీడించే బ్యాంక్ మేనేజర్‌గా కనిపించి, మెప్పించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అభిరుచి కలిగిన ప్రేక్షకులని ఆకట్టుకొనే నిజాయితీ ఉన్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. మంచి సినిమాల్ని ప్రోత్సహిద్దామనుకొనే వాళ్లను ఇది అసంతృప్తికి గురిచెయ్యదు. రెగ్యులర్ హీరో హీరోయిన్ల రొమాన్స్, ఫైట్లు, పాటలు ఆశించి వెళ్లే వాళ్లు మాత్రం అసంతృప్తికి గురవుతారు.
రేటింగ్: 3/5
- బుద్ధి యజ్ఞమూర్తి