బ్రహ్మొత్సవం అందుకే ఫ్లాప్ అయ్యింది!
on May 21, 2016
భారీ అంచనాల మధ్య బ్రహ్మోత్సవం విడుదలైంది.. ఎన్నో ఆశలతో థియేటర్లకు వెళ్లిన మహేష్ బాబు అభిమానులు నీరసంగా ఇంటి దారి పడుతున్నారు. సినిమా ఫ్లాప్.. అన్నది అందరిమాట. ఇంత మంది భారీ తారాగణం, భారీ బడ్జెట్, కలర్‌ఫుల్ సెట్లు.. అన్నిటికి మంచి మహేష్ బాబు.. ఇన్ని హంగులు, వనరులు ఉన్నా కూడా శ్రీకాంత్ అడ్డాల ఓ మంచి సినిమా తీయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలేంటి?? తెర వెనుక ఏం జరిగింది? ఆ విషయాలన్నీ ఓసారి ఆరా తీస్తే ఈ నిజాలు బయట పడ్డాయి
* శ్రీకాంత్ అడ్డాల కథేం అనుకోలేదట. బౌండెడ్ స్ర్కిప్టుతో మహేష్ బాబు దగ్గరకు వెళ్లలేదట. మహేష్‌నీ, నమ్రతనీ కూర్చోబెట్టి పదంటే పది నిమిషాలు కథ నేరేట్ చేశాడట. కుటుంబ అనుబంధాలు అనే కాన్సెప్ట్ నచ్చి, శ్రీకాంత్ పై నమ్మకంతో ఈ సినిమాని మహేష్ ఒప్పుకొన్నాడని తెలుస్తోంది.
* షూటింగ్ మొదలై.. ఫస్టాఫ్ అయ్యేంత వరకూ సెకండాఫ్‌లో ఏముంటుందో, దర్శకుడు ఏం తీస్తాడో కూడా టీమ్ కి తెలీయలేదట. ఫస్టాప్ అయ్యింతరవాత మళ్లీ పరుచూరి బ్రదర్స్‌ని సాయం అడిగి సెకండాఫ్ రాసుకొన్నాడట.
* సీన్లు మరీ.. సుదీర్ఘంగా సాగాయి అన్న ఫీలింగ్ జనాలకు వచ్చింది. ఇంతింత లెంగ్తీ సన్నివేశాలు వద్దు అని మహేష్ ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడని, అయితే శ్రీకాంత్ అడ్డాల పట్టించుకోలేదన్న టాక్ వినిపిస్తోంది.
* రషెష్ చూస్తే నాలుగు గంటల సినిమా వచ్చిందట. అది చూసే.. మహేష్ షేక్ అయిపోయాడట. ఆ సినిమాని కుదించి రెండున్నర గంటలకు తీసుకురావడానికి చిత్రబృందం ఆపసోపాలు పడిందట. ఈ సినిమాలో అక్కడక్కడ కంటిన్యుటీ సీన్లు మిస్సవ్వడానికి కారణం అదే. సినిమా ఫ్లాప్ అని తెలిసిన తరవాత మరో 12 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశారు. దాంతో ఈ సినిమా మరింత అతుకుల బొంతలా తయారైంది.
* సమంత క్యారెక్టర్ బాగున్నా.. సమంత గ్లామర్ బాగా డల్ అయిపోయింది. సమంతని చూడలేకపోయాం.. అంటున్నారు జనాలు. అసలు సమంతని ఎంచుకోవడం చిత్రబృందంలో ఏ ఒక్కరికీ ఇష్టంలేదట. కానీ శ్రీకాంత్ అడ్డాల పట్టుబట్టి మరీ ఈ సినిమాలోకి సమంతని లాక్కొచ్చాడని టాక్.
* సగం సినిమా రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్లు వేసి తీశారు. ఆ సెట్లు కలర్‌ఫుల్‌గా ఉన్నా.. సినిమాకి అతకలేదు. ఏదో నాటకం చూస్తున్న పీలింగ్ కనిపించింది. దాంతో ఎవ్వరూ కనెక్ట్ కాలేకపోయారు.
* జనాలు సినిమాకి వెళ్లేదే వినోదం కోసం. అదెక్కడా ఈ సినిమాలో కనిపించలేదు. టీవీ సీరియల్ తీత... దానికి తగిన రాతతో బోర్ కొట్టించాడు శ్రీకాంత్ అడ్డాల. ఎమోషన్ సీన్లు రాసుకొన్నా.. కథలో కంటెంట్‌లో బలం లేకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ తేలిపోయాయి.
* కొన్ని సంభాషణలు బాగున్నట్టే అనిపించినా.. అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అంత ఇంటలెక్యువల్ సంభాషణలు ఈ సినిమాకి సెట్ కావు.
* కాస్టింగ్ బోల్డంత మంది ఉన్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారో అర్థమైతే గొప్పే.
* ఇలా ఒకటా రెండా.. కర్ణుడి చావుకి కారణాల్లా..బ్రహ్మోత్సం డిజాస్టర్‌కీ అన్నే రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం.. స్ర్కిప్టు దశలోనే జాగ్రత్త పడితే మహేష్‌కి ఈ అవమానం తప్పేది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
