ఓటుహక్కు!!
ప్రజల సమూహం సమాజం
సైన్యం సమస్తం నేనే
మహాద్భుతమైన పనులనెన్నో
ప్రపంచంలో చేసిందీ నేనే!
పొలాల్లో పంటలు పండించిందీ
ఫ్యాక్టరీల్లో చెమట చిందించిందీ నేనే
కూడూ గుడ్డా గూడూ నీడా
మేడా మోటారు సృష్టించిందీ నేనే!
శ్రమశక్తిని నిలువెల్లా దోపిడీజేసినా
ఎదిరించలేక బెదిరిందీ నేనే
భయంకర తుఫానులెన్నో మీదపడినా
పీడకలలనుకోని మరిచిందీ నేనే!
అప్పుడప్పుడు అసహనం
అరకొరగా అక్కడక్కడా చూపిందీ నేనే
హక్కులకై పోరాడిన వీరుల
పోరుకు భుజందట్టి పంపిందీ నేనే!
వార్తమానపు ప్రస్తుతంలో
గతచరిత్ర యాదు మరిచిందీ నేనే
దారుణాలు దాష్టికాలు జరుగుతుంటే
చేష్టలుడిగి నిలిచి చూసిందీ నేనే!
రాజకీయ ఎత్తుగడల వెనుకమర్మాలు
గతంలోకిజూసి ఒడిసిపట్టిందీ నేనే
చైతన్యంలేని సంఘమని విర్రవీగిన
అహంకారుల నోర్లుమూయించబోతుందీ నేనే!
పిచ్చివాళ్లనుజేసి ఆడిద్దామనుకున్నవాళ్ళ
రాజకీయ తలరాతలను మార్చబోయేది నేనే
ఓటుహక్కుతో దార్శనికులను అందలమెక్కించి
కడదాకా అండగా నిలిచే జనతా నేనే!
-- రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!
