Facebook Twitter
ఓం శాంతి! శాంతి! శాంతిః!!

ఓ బొజ్జ గణపయ్య 
నీ భక్తులమ్మేమయ్య 
చవితి చంద్రున్ని చూస్తిమేమోనయ్య
సతమతమవుతూ సాగుతుంటిమయ్య!

ఆ నీలాపనిందలతో 
గిల్లికజ్జాలైతే 
గింజల నింపుతున్న గోతాన్ని 
ఎత్తికుదేసి నింపితే చక్కగా ఒదిగినట్లు 
వదులుగానున్న బంధాలన్నీ 
వదులుకోనంత బిగుసుకుంటయయ్య !

ఆ నీలాపనిందలతో 
ఉప్పూనిప్పైతే 
తిప్పలెక్కువయ్యి 
తిక్కలెక్కువయ్యి 

చక్కనయిన స్నేహాలెన్నో 
అక్కరకురాని అనుబంధాలుగా 
చెదురుమదురై చిట్లిపోతయయ్య !

ఆ నీలాపనిందలతో 
కొరివీచమురైతే 
అగ్గి ఆరిపోదదయ్య 

అలవిగాదదయ్య 
అణచ వీలుకాదదయ్య
అంతా ఆహుతేనయ్య!

ఆ నీలాపనిందలతో 
శత్రుఘ్నుల శత్రుత్వమైతే 
మిస్సైల్ల పలకరింపులైతే 

డ్రోన్ల దాడుల దర్శనాలైతే 
మానవత్వమే మృగ్యమయ్య
మనిషితనమే బ్రతకదయ్య
మనిషి మనుగడే ఉండదయ్య!

ఆ నీలాపనిందలు నిలువరించవయ్య
మిక్కిలి తక్కువతో తిప్పలు తప్పించవయ్య
విశ్వశాంతిని కాపాడవయ్య 
దయతో శాంతిని ప్రసాదించవయ్య

ఓ విఘ్నేశ్వరా సర్వవిఘ్నోపశాంతయే 
ఓం శాంతి! శాంతి! శాంతిః!

- రవి కిషోర్ పెంట్రాల