Facebook Twitter
విశ్వావసు ఉగాది

కృషీవలురకు శక్తినివ్వు

కలల వయసుకు నింగినివ్వు 

బెరుకు సొగసుకు ధైర్యమివ్వు

గడుసు మొరటుని బెదరనివ్వు!

పెరుగు పైరుకు ఆయువవ్వు 

పదును చేనుకు పంటనివ్వు 

మకిలి మేనుకు బుద్ధినివ్వు

మంచి మనిషికి మేధనివ్వు!

తపనబ్రతుకుకు దారినివ్వు 

ఒంటరి నడకకు తోడువవ్వు 

బడుగు హెచ్చునకు నిచ్చెనవ్వు

తలచిన గమ్యం చేరనివ్వు!

ఎడదల కలతలని తరగనివ్వు 

మనసుల మమతలని పెరగనివ్వు 

మనముల వగపులని తొలగనివ్వు 

మనుషుల సమతలని ఎదగనివ్వు!

ఆపన్నుల కన్నీటికి కట్టవవ్వు

సౌభాగ్యాల ఆనందపు సంద్రమవ్వు 

ముంచుకొచ్చు ప్రళయాలే భస్మమవ్వు

సౌజన్యుల జీవితాలు ప్రదీప్తమవ్వు!

— రవి కిషొర్ పెంట్రాల