Facebook Twitter
రగ్గుల నడకలు!!

అంతరంగంతో పెన వేసుకొని 

అలనాటి మా ఊరి జ్ఞాపకాలు

అందమైన హేమంత ప్రభాత వేళల్లో  

అదిరించు చలిలో రగ్గుల నడకలు!

విశ్వంభర దేవి 

రేతిరి మేని ముసుగు తీసి 

తెలి మంచు వన్నెతో వెలుగొందుతున్న   

సుప్రభాత వేళల్లో అలనాటి మా పల్లెల్లో!

మాస్టారి ప్రైవేటుకు రగ్గులతో

మా తోబుట్టువులతో వెడుతుంటే 

మా మిత్రులు త్రోవలో రగ్గులతో 

మా చుట్టూ ఎన్నో రగ్గుల నడకలు!

ఆలమందల ఆలనా పాలనలో కొన్ని

చేనుకి సాగుకై వెళుతూ కొన్ని 

పాల కేంద్రమునకు లైనుకట్టి కొన్ని

చెరువు నీళ్లకు బిందెలతో మరికొన్ని!

రోళ్ళ దగ్గర దంచుతూ కొన్ని

చలిమంటల చెంతన కొన్ని

కల్లాపి చల్లుతూ కబుర్లతో కొన్ని 

ముగ్గులేస్తూ ముచ్చట్లలో మరికొన్ని!

రచ్చబండన పొగలొదులుతూ కొన్ని

హరి నామ కీర్తనలతో కొన్ని 

కాటి కాపరి వేషములతో కొన్ని 

డూడూ బసవన్నలతో మరికొన్ని!

ఆకుపచ్చని పొలాలేమో

చిరు ముత్యపు తుషారపు రగ్గు కౌగిలిలో

ఉషోదయం సఖుని కొనిపోవునేమోనని 

కించిత్ విరహ వేదనతో!


— రవి కిషోర్ పెంట్రాల