Facebook Twitter
నిశ్శబ్దం!

నిశ్శబ్దం!


మిమ్మల్నే కానివ్వండి మొదలెట్టండి

మీరేం మాట్లాడాలని మదనపడేవారో 

మీకు ప్రసంగించే అవకాశమొచ్చింది

గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది!


గడబిడా గోలజేసే ఫ్యాను పీకేశాం

టెలివిజన్ న్యూసు రగడ తీసేశాం 

కంప్యూటర్ మౌసుక్లిక్కులు ఆపేశాం 

ఇకజెప్పండి మీ మైండులో ఏముందో!


రైళ్ళలసి ప్లాటుఫారంమీద కూలబడ్డాయి 

స్టీమర్లూ హార్బరులో రెస్టుతీసుకుంటున్నాయి

శునకాలన్నీ తలలువాల్చి పడుకున్నాయి

పక్షులన్నీ గూళ్ళలోకిజేరాయి మాట్లాడండి!


నగరవాసులకు జోలలుపాడి నిద్రబుచ్చి

నగరం ఆదమరచి గాఢనిద్రలోనుంది 

కీచురాళ్ళూ కిమ్మనకుండా కునుకేస్తున్నాయి 

ఇకనైనా గొంతు సవరించుకుని మాట్లాడండి!


వినాలనుంది మీ పలుకులశబ్దాల్లో

భద్రంగా దాచుకున్న మీ మనోగతాన్ని

ఒంటరితనపు ఆక్రందనల జ్ఞాపకాలు

అణచివేతకు పెల్లుబికిన విప్లవగీతాలు!


నచ్చని అరాచక రాజకీయ గొడవలు

రాకెట్టులతోబాటు ఊరేగే ధరల దడదడలు 

క్రూరపు కీచకపర్వాల కలవరపు కలతలు

తెలిసినవీ విన్నవీ అనుకున్నవన్నీ మాట్లాడండి!


పోనీ నాన్నమోసిన బాధ్యతలమోతలు

అమ్మపంచినప్రేమ పిల్లల్నిపెంచినరోజులు 

నచ్చినపుస్తకం మెచ్చినప్రదేశం ఊరించేవంట  

మీ అంతరంగాన్ని ఆవిష్కరించండి ఎవ్వరూలేరులే !


ఏంటి నోరింకా పెగలడంలేదా

వెన్నులో భయమింకా తొలగడంలేదా 

పోలింగ్ బూతుకెళ్లి నిశ్శబ్దంగా

జీవితానికి భరోసానిచ్చే సరైనోళ్ళని ఎన్నుకోండి!


--- రవి కిషొర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!