
దిష్టిబొమ్మల సమూహాలే రూపాల్లో
పడమట సంధ్యకు ఒరిగిన జనుల గుంపులన్నీ
బాన పొట్టలతో బరువైన హృదయాలతో
ఊసిపోయిన జుట్టుతో అలసిపోయిన కళ్ళతో
జారిన బహువులతో ఎండిన కన్నీటి చారలతో!
బ్రతుకుబండిని గమ్యంవైపుకు నడిపిస్తూ
విశ్రాంతి లేక వడలిపోయి కొందరు
వారసత్వ సంక్రమణ ఆరోగ్య అవలక్షణాలు
వృత్తి వ్యవహార ఒత్తిళ్ళతో నలిగి నీరసించి మరికొందరు!
జీవితంలో లోటనేది దరిదాపుల్లో లేకపోయినా
ఇంకేదో లోటని తెగ వెదుక్కుంటూ కొందరు
లెక్కలేనంత సంపద సొంతమయినా
ఇంకేంటో సంపాదించాలని తపనతో మరికొందరు!
లెక్కకుమించి అభిమానులను పొందినా
ఇంకేవో అవార్డులు కోసం ఎదురుచూస్తూ కొందరు
అత్యున్నతస్థాయి అధికారపీఠం దక్కించుకున్నా
మరేదో ప్రైజ్ కావాలని ఆశిస్తూ ఆందోళనలో మరికొందరు!
సమాజం ఎందుకు పరుగెడుతుండో
తాము దేనికోసం ఆరాటపడాలో అర్థంకాక కొందరు
గుంపుతో పాటు శక్తికి మించి పరిగెడుతూ
జీవన సాగర ఆటుపోట్లను తట్టుకొంటూ మరికొందరు!
వాసంత వయసు కలలసాగుకు కాడిదించేసి
ఓటమికి నిర్లిప్త రంగు నిలువెల్లా అద్దుకొని కొందరు
ఆశయ సాధన దిశలో అలసినా
జీవన సమరంలో ఆగక పోరాడుతూ మరికొందరు!
వెరసి
దిష్టిబొమ్మల సమూహాలే రూపాల్లో
పడమట సంధ్యకు ఒరిగిన జనుల గుంపులన్నీ
బాన పొట్టలతో బరువైన హృదయాలతో
ఊసిపోయిన జుట్టుతో అలసిపోయిన కళ్ళతో
జారిన బహువులతో ఎండిన కన్నీటి చారలతో!
—రవి కిషోర్ పెంట్రాల



