Facebook Twitter
అప్పుడప్పుడు!

 అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది
కాల ప్రవాహాన్ని ఎదురీది
గడచిన మజిలీలకు మళ్ళీ చేరాలని
మార్పు చేర్పులేవో చెయ్యాలని కాదుగానీ 
ఇంకొన్నిసార్లా మధురిమల్ని ఆస్వాదించాలని!

 మళ్ళీ బుజ్జాయినయిపోతే బాగుండని
ఉయ్యాలతొట్లో జాలిగా ఊగాలనో 
గుర్రుపెట్టి నిద్దురోవాలనో కాదుగానీ 
పాపాయిగా నేనుపెట్టే కేరింతలకు 
అమ్మనవ్వే నవ్వులు ఇంకోసారి చూడాలనీ
తప్పటడుగులేస్తూ నాన్న వేలుపట్టుకొని 
మరొక్కసారి తనతో నడవాలనీ!

 
పిల్లాడై బడికెళ్ళగలిగితే బాగుండని
బాధ్యతలు తప్పించుకోవాలని కాదుగానీ 
బ్రతుకుసేద్యంలో చెట్టుకు పుట్టకొకరైన 
అలనాటి ప్రియ మిత్రులతో 
ఇంకాస్త ఎక్కవ సమయం గడపాలనీ!


తొలి కొలువు చేసిన నెలకి 
తిరిగి వెళ్ళగలిగితే బాగుండని
తక్కువ పనులతో తిరగాలని కాదుగానీ 
మొదటి జీతం తీసుకున్న ఆనందం 
ఇంకొక్కసారి అనుభవంలోకి తెచ్చుకోవాలనీ!

కన్న పిల్లలు ఇంకొన్ని రోజులు
పసిపాపల్లా ఉండిపోతే బాగుండని
తొందరగా పెరిగేస్తున్నారని కాదుగానీ
బుడినడకల బుడతలైతే 
మరికొన్నిరోజులు వాళ్ళతో ఆడుకోవచ్చనీ!

 - రవి కిషోర్ పెంట్రాల