Facebook Twitter
ఆరేడడుగులే!!

జీవన వాసంతంలో 

అరుదైన గమ్యందారిని 

రమ్యంగానే దొరకబుచ్చుకొని

ప్రియంగానే ప్రయాణిస్తూ బాటసారి!

పులకించే ప్రేక్షకవనాలను

కూసేకోయిల్ల పొగడ్తలను

సందరాభిమాన విరులను 

సువాసనల సంపదలనుజూచి..

ఉత్సాహంతో ఉరకలేస్తూ 

ఘనకీర్తినార్జించిన మేధస్సుతో 

అవరోధాలను అధిగమించి 

తారాతీరపుగమ్యంజేరే ఆశలో..!

నడకల్ని దహించే గ్రీష్మాలు

కలల్నిముంచి దోచుకెళ్లే వర్షాకాలం 

యోచనల్ని మొద్దుబార్చే హేమంతం

కోర్కెలనిరాల్చే శిశిరాలుండేననీ మరిస్తే…

తారలసరసకు చేరినవీరుల

అడుగులజాడలు ఒడిచిపట్టకపోతే 

ఊహలసొనతీగ నింగినంటినా 

బ్రతుకెదుగుతీరందర్లా ఆరేడడుగులేనేమో?

మధుమాసమే శాశ్వతమనుకొని

ఆశలపల్లకిలో హమేశా ఊరేగితే  

విద్వత్తుకు విడువక సానపెట్టుకోకపోతే

ఆరేడడుగులుమించి జీవితమెదగదేమో??!

--రవి కిషోర్ పెంట్రాల