మానస పద్మవ్యూహం!!
నీ మానస
పద్మవ్యూహంలోకి
నేరుగా చొరబడుటకు
పదివేలదారుల్లేవుగా ప్రేయసీ!
అడుగడుగునా
అతిరథ మహారథులెందరో
యుద్ధంలో అడ్డుపడుటకు
నేనా ఒంటరినే నెచ్చెలీ!
వలపు యుద్ధభూమికి
పరిచయంలేని పసివాడిని
నేర్పరులైన నేస్తులూలేరు
యుద్ధసన్నద్ధంజేయుటకు చెలీ!
వెన్నుచూపుటా నేర్వలేదు
దార్లు పదివేలుగానీ
కోటిపదారువేలదారులవనీ
ఢీకొందునందరినీ నీకై ప్రియా!
మునుపు క్రీగంటజూచి
ఓ చిరునవ్వు విడిచిపోతివి
దొరుకునేమోనని దొంగగా
నిల్చినవ్వినచోటే తెగవెతికితి సఖీ!
విరహపు గ్రీష్మతాపంలోవేగి
తొలకరివర్షపు ప్రేమలేఖలకు
పరవశించి పరిమళముల
మెండుగా వెదజల్లు పుడమిలా!
నీ చిరుక్షణవీక్షణ భాగ్యమునకే
హృదిలో పులకల పదనిసలురేగేనని
చూపులభాషతోనే విన్నవించాలని
తొలిప్రాయపు ప్రేమికుల తపన!
- రవి కిషొర్ పెంట్రాల
