అమ్మడూ ఓయ్ వాట్సప్ మెసేజ్
అమ్మాయి అల్లుడూ పండక్కొస్తారంట
బియ్యం పిండికి మిషనుకి పట్టకెళ్ళనా
పట్నంనుండి స్వీట్స్ పట్టుకురానా!
అహ్ ఏంటోనండి ఆరోజుల్లో అయితే...!
ప్రభాతాల్లో మంచుముసుగేసుకొని
హేమంతాన సొగసుతో పల్లెంతా
చలిమంటలా మేనిముసుగు తొలగిస్తూ
అమ్మాపిన్నీ ఎల్లమ్మాపుల్లమ్మ చలికి బెదరక!
రోలుకీరోకలికీ పసుపూ కుంకమతో పూజజేసి
రామన్నా భీమన్నా క్రొత్తబియ్యం దంచేస్తుంటే
పుల్లమ్మా ఎల్లమ్మలు ఛలోక్తులతో పిండిజల్లేసి
పాకానికి చక్కెర బెల్లాలతో తయ్యారు!
ఆరుబయట పెద్దపొయ్యిన మంటకి చలిపరారు
అమ్మలక్కల సందడితో ఇల్లంతా పండగకళ
గలగలసవ్వడికి పిల్లలంలేచి కల్లొత్తుకుంటూ
పాకపుతయ్యారీ రుచిచూస్తూ నీటిన పరీక్షిస్తూ!
సలిమిడి రుచిజూస్తూ అరిసెలుజేస్తూ ఓ వైపు
చెక్కలూ కారాలూ బూందీ నములుతూ ఓ వైపు!
రుసరుసమని అరిసెలు నూనెలో కాలుతుంటె
బుసబుసమని చల్లనికట్టెలు పొయ్యిలో కాలుతూ!
వాయలు వాయలు అరిసెలూ కారాలూ దింపుతుంటే
వాయకోసారి హరిదాసులో గంగిరెద్దులవారో
గారడివాళ్ళో పిట్టలదొర్లో రావడం వాళ్ళెంట మేము!
అమ్మేసిన పిండివంటల వాయలు కొన్ని వాళ్ళకూ
వాళ్ళిచ్చిన అశీర్వాదాలన్నీ మా కుటుంబాలకి!
సూరీడికీ పిండివంటల సవాసన అందిందేమో
నాకివ్వరూ కొన్ని రుచులంటూ లేకిరణాలతో
మబ్బులు దాటుతూ మంచుపొరల చీల్చుతూ
వంటలన్నీ సుతారముగా తడుముతూ
సందడి రుచులు నేనూ చూస్తానంటూ
మళ్ళీ దొరికేనోలేదో ఈ పండగ సిరులని!
- రవి కిషొర్ పెంట్రాల
