హరిదాసు హరినామ సంకీర్తనలతో
జంగమదేవర శంఖపు రవళులతో
మా ఊరి ఆస్థాన విద్వాంసులు
నాయీ బ్రాహ్మల మంగళవాద్యమంత్రాలతో
హేమంతసిరుల మకర సంక్రాంతి మొదలు!
ముత్యాలముగ్గుల గొబ్బిళ్లు ఇంటా బయటా
బంతిపూల తోరణాలతో సింగారపు ద్వారాలు!
గంగిరెద్దోళ్ళూ పిట్టలదొరలూ పగటేషగాళ్ళూ
ఇంటింటినా పండగజరిపి త్వరగా గూడుజేరాలని
వడివడిగా వీధులన్నీ తిరిగేస్తూ సందడిజేస్తూ!
మా మాష్టారికీ పూజారికీ చిరువ్యాపారికీ
పాలూ కూరగాయలతో పండగ పలకరింపులు!
ఊరంతా వంటల సువాసనల నెత్తావులు
తెలిమంచు పొరలతో పోటీగా నోరూరిస్తూ
క్రొత్తపంటల పెద్దపండుగ తొలిపొంగళ్ళు!
మా ఊరి చెరువేమో తెప్పోత్సవానికి ముస్తాబు
మా ఇలవేల్పులు సీతారామలక్ష్మణులు
ఆంజనేయ సమేతంగా మేళతాళాలతో
పురజనులను అశీర్వదించుటకు సిద్ధం!
ధన్యులు దేవుళ్ళపల్లకీ వీధుల మోస్తుంటే
దేవుళ్ళేమో వీధిలోని రంగవల్లుల ఆస్వాదిస్తూ
రంగురంగుల రథాలు నెమళ్ళు అబ్బురంగా
మైమరచిన తన్మయత్వంలో చెరువుకి!
కొలనుచుట్టూ ప్రజలు పండగకి ముస్తాబై
అమ్మలక్కలు దేవుళ్లనికొలువ కొత్తకోడళ్ళతో
దేవుడేమో ఏ ముగ్గులు ఏ రమణులు వేశారో
రమణుల రంగవల్లుల పోల్చుతూ సీతమ్మతో!
ఉత్సవమూర్తుల ఊరేగించు భాగ్యము మాకంటూ
ఎడ్లగిత్తలు దేవుళ్ళను బండిపై ఊరేగిస్తుంటే
రంగవల్లులపై తనివితీరని సీతారాములు
ప్రతిగడపనా ఆగి చూచి హారతులుగైకొని
వరాలిచ్చి అలసిసొలసి ప్రభాతానెపుడో గుడికి!
ప్రతిసారి ఒక్కోసంబరం ఊరేగింపు బండెనక
ఓ సారి బుర్రకథ హరికథోసారి కోలాటమోసారి!
తెప్పోత్సవ తిరుణాలే మా బొమ్మల కొలువులు
దోస్తుల చెరువున ముంచితేల్చి కవ్వించుటే
మా పాలిట జూదమెయ్యని పందాలు పతంగులు!
కొత్త అల్లుళ్ళకు అళ్ళెము తయారుజేస్తూ అత్తలు
అయిన వాళ్లందరినీ పరిచయంజేస్తూ ఆలులు
బావలిచ్చిన గిఫ్టులజూచి మురిసే బామ్మర్దులు
బ్రహ్మాండమైన ఈ ఉత్సవానికి తరించె మా ఊరు!
— రవి కిషొర్ పెంట్రాల
