యుద్ధ విరామ ఒప్పందం!!
విరామం తర్వాత
నేను బ్రతికేందుకు
వీళ్ళలో ఎవరితో పోరాడాలో
నా వాళ్ళ కోసం
ఈ గుంపున ఎందర్ని కడతేర్చాలో!
ఆ రోజు నన్ను భయపెట్టిన
ఆ మొహమెవరిదో
నా గన్ను తూటాలకి
గాయపడ్డ ఆ శరీరాలెవ్వరివో!
కదనరంగంలో చెలరేగుతూ
కర్కశంగా కాల్చేస్తూ
నిరాయుధున్ని దయదలిచి వదిలిన
ఆ దయామూర్తులెవరో!
ఎందరికి
ఎందర్ని దూరం చేసానో
ఎందుకు
అందరిని ఎడం చెయ్యాలో!
ఎగసిపడే క్రోధం భయం నిరాశలను
తుఫాన్ సమసినట్టుగా చేసిన
తాత్కాలిక యుద్ధ విరామ ఒప్పందం
కలకాలమెందుకుండదో అనుకుంటూ!
యుద్ధభూమిలో శత్రుసైన్యంపై
మనసుల్లో ద్వేషం లేదని
ఏలికల కీలతో ఆడే
మరమనుష్యులమేననీ తెలుపుకుంటూ!
ఇరుసైన్యాల మృతదేహాలకు
ఉమ్మడిగా వీడ్కోలు పలుకుతూ
బరువైన హృదయాలతో
అంతిమ సంస్కారాలు జరుపుతూ!
ఒకరితోనొకరు ఆడుతూ పాడుతూ
మనస్సులు పంచుకుంటూ
మళ్ళీ జరగబోయే మరణమృదంగానికి
ముందుగానే క్షమార్పణలు చెప్పుకుంటారేమో?
-- రవి కిషోర్ పెంట్రాల
