ఇది నా దేశం
ఇది నా దేశం
ఒంటిపై కప్పుకోడానికి బట్టల్లేక చలికి వణికే అనాధ పిల్లలు
ఒంటిపైనున్న బట్టలు ఏ మానవ మృగం లాగుతుందోనన్న భయంతో ఆడపిల్లలు
ఆహరం లేక, ఆక్సిజన్ అందక చనిపోయేవాళ్లు కొందరు
ఆహరం, ఆక్సిజన్ తో వ్యాపారం చేస్తూ బ్రతికేవాళ్లు కొందరు
మానవత్వాన్ని మరిచి సాటి మనిషికి సాయం చేయని మనుషులు
మతం మత్తులో, కులం కుళ్ళులో మనిషిగా బ్రతకడం మరచిన మనుషులు
ఇది నా దేశం
దేశ గౌరవాన్ని మువ్వన్నెల జెండాకి పరిమితం చేసిన ప్రదేశం
ఇది నా దేశం
మంచితనం, మానవత్వమని మాటలు చెప్పడంలో ముందున్నాం
ఆచరణలో వెనక పడుతున్నాం
ఇది నా దేశం
"నా ఉచ్వాస నిశ్వాసలు జాతీయ జెండా రెపరెపలు
నా హృదయ స్పందన జనగణమన" అని ఘనంగా చెప్పుకుందాం
అంతకన్నా ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకుందాం
దేశ గౌరవాన్ని నిలబెడదాం.
-గంగసాని