తీరంలేని కాలినడక...
posted on Jan 12, 2021
తీరంలేని కాలినడక...
పడమటి దారులెంత దూరంగా ఉంటాయో తెలుసా
ఎప్పటికీ అందుకోవాలనిపించనంత దూరంగా
వెళితే తిరిగి రావాలనిపించనంత దూరంగా
ఉషోదయాల్ని కోరుకోవటం మాత్రమే బావుంటుంది
ఆ కోరుకోవటం మానేసాక గుడ్డిదీపాల్ని వెలిగించటం మరెవరూ నేర్పరు..అసలక్కర్లేదేమో
పైరగాలి పెదవంచున నిశ్శబ్ధాలు
తీరం లేని కాలినడకలు
మన్ను తాకిన మిన్నుల్లో కాయితప్పడవలు
ఇక మరెన్ని నోస్టాల్జియాలు
నిన్ను మాత్రమే మిగిల్చినపుడు
నవ్వుకో ఏడుపుకో కాసేపు నిన్ను నువ్వు అరువిచ్చేసి
మళ్ళీ తిరిగొచ్చెయ్
శూన్యం మాత్రమే దోసిట్లో ఒలకబోస్తున్న దారుల్లోకి
అసలేమీ వినిపించనంత ఇంకేమీ కనిపించనంత నీలోకి
ప్రేమించబడాలనే ఆశలేమీ లేనపుడు
ప్రేమించటం మాత్రమే నేర్చుకున్న నీలోకి
-సరిత భూపతి