విలీనం ఆరాటంలో టీఆర్ఎస్ చంద్రబాబు
Publish Date:Dec 17, 2011
Advertisement
హైదరాబాద్ : ఎన్నికల ముందు పుట్టిన పీఆర్పీ, ఆపై కాంగ్రెస్‌లో విలీనమైందని, తానెప్పుడు విలీనం కావాలా అన్న ఆరాటంలో టీఆర్ఎస్ ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, పీఆర్పీ,జగన్‌లపై ఆయన విరుచుకుపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు ఊడిగం చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విరుచుకుపడ్డారు. టీఎన్టీయూసీ రాష్ట్ర నూతన కార్యవర్గంతో ఆయన ఈరోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. రాంబాబు అధ్యక్షుడిగా 135 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. తనపై పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకుంటే పార్టీని రద్దు చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం పనిచేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఓ చారిత్రక అవసరమన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని తాను నాడు చేసిన వ్యాఖ్యలు నేడు నిజమయ్యాయన్నారు. రాజీవ్ యువకిరణాలు ఒట్టి బోగస్ అని మంత్రులే అంటున్నారని ఆయన గుర్తు చేశారు. వచ్చే కాలంలో ప్రజలకు నాణ్యమైన మంచి పాలనను అందించేది ఒక్క టీడీపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తెరాస అధ్యక్షుడు కేంద్రంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే బీడీకట్టలపై పుర్రె గుర్తు వేసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.
http://www.teluguone.com/news/content/tdp-24-9980.html





