తెలంగాణలో పాలసీ పెరాలసీ లేదు..పెట్టుబడులకు సంపూర్ణ భద్రత: సీఎం రేవంత్
Publish Date:Nov 14, 2026
Advertisement
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసీ లేదని, పెట్టుబడులకు సంపూర్ణ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించిందని తెలిపారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తెలంగాణను ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. 2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని వెల్లడించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంలో ఐఎస్‌బీ, నల్సార్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాయని రేవంత్ రెడ్డి అన్నారు. వైద్య రంగంలోనూ హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంలో పీహెచ్‌ఎఫ్‌ఐ వంటి సంస్థలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ఇప్పటికే ప్రారంభించామని, మిగతా టిమ్స్ ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని, ఆస్పత్రుల అభివృద్ధి కోసం మొత్తం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దేశంతో పాటు మధ్యప్రాచ్య, ఆసియా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారని సీఎం తెలిపారు. గత నాయకులు తీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయాలే నేటి హైదరాబాద్ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో అక్షరాస్యత కేవలం 12 శాతం మాత్రమే ఉండేదని, ఆహార కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు పునాదులు వేశారని చెప్పారు. శ్రీశైలం, భాక్రా నంగల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి నీటి వసతి పెరిగి, దేశం ఆహార కొరత నుంచి మిగులు ధాన్యాల స్థాయికి చేరుకుందని వివరించారు. సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన మార్పులు దేశంలో ఐటీ రంగం అభివృద్ధికి బాటలు వేశాయని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని గుర్తుచేశారు. దేశంలోని ప్రతి గ్రామానికి విద్య చేరినా, నాణ్యమైన విద్యను అందించడంపై ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పిల్లలు ప్రపంచంతో పోటీపడాలి: సీఎం రేవంత్.! తెలంగాణలోని మారుమూల గ్రామంలో చదువుకునే విద్యార్థి సైతం న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను చూపాయని అన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు అమలు చేసిన మంచి విధానాలను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని చెప్పారు. పెట్టుబడిదారులు, విద్యాసంస్థల విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని, తద్వారా అంతర్జాతీయ స్థాయి విద్య స్థానికంగానే అందుబాటులోకి వస్తోందని తెలిపారు. తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌ను రూపొందించామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కీలక పాత్ర పోషిస్తోందని, దాని పరిధిలో సుమారు కోటి 34 లక్షల మంది నివసిస్తున్నారని సీఎం తెలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తూ.. ఈ ప్రాంతాన్ని సేవారంగానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ అవతల రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం చేపడుతున్నామని, 160 కిలోమీటర్ల రహదారికి టెండర్లు పిలిచామని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ సుమారు 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతాన్ని రేర్ (RARE) విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, పెట్టుబడులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆదాయంలో సుమారు 65 శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే వస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా రంగారెడ్డి నిలిచిందని చెప్పారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చని సీఎం భరోసా ఇచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాలు కూడా హైదరాబాద్‌లోని జీఎంఆర్ పరిధిలో తయారవుతున్నాయని వెల్లడించారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ కేరాఫ్.. భారీ పెట్టుబడులకు అవకాశం.! 1960వ దశకంలో నెహ్రూ, ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ఏర్పాటు కావడం వల్లే రాష్ట్రంలో ఫార్మా రంగానికి పునాదులు పడ్డాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిందన్నారు. దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని చెప్పారు. అనేక అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని, పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైద్య రంగానికి రూ.12 వేల కోట్లు.. ఆరోగ్య డేటాపై ప్రత్యేక దృష్టి.! వైద్య రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి, రాష్ట్రంలో రోగుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ డేటా రిచ్ స్టేట్ అని పేర్కొన్న సీఎం.. ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో గుర్తించవచ్చని వివరించారు. ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడుతోందని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మూసీ శుద్ధి తప్పనిసరని సీఎం స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. 2028 జూన్ 2 నాటికి పీహెచ్‌ఎఫ్‌ఐ ప్రాజెక్టు పూర్తి.! పీహెచ్‌ఎఫ్‌ఐ ప్రాజెక్టును 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పీహెచ్‌ఎఫ్‌ఐ ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించడంతో పాటు, తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో సమగ్ర అభివృద్ధితో తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మీకు నచ్చవచ్చు: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.! [ Telangana Rising 2047, CM Revanth Reddy, Telangana Investments, Policy Paralysis, Telangana Global Summit 2026, One Trillion Dollar Economy, Three Trillion Dollar Economy, Telangana Development ]
http://www.teluguone.com/news/content/-telangana-rising-2047-24-237132.html





