నరసన్నపేటకు నిధుల వెల్లువ
Publish Date:Apr 25, 2012
Advertisement
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వర్షాన్ని కురిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద ఈ నియోజకవర్గ అభివృద్ధికి హడావుడిగా సుమారు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ చిన్నా చితకా పనులన్నీ చేసే బాధ్యతను పార్టీ చోటా మోటా నాయకులకు, కార్యకర్తలకు అప్పగిస్తున్నారు. వర్క్ ఆర్డర్లు చేతిలోకి రావటంతో మొదట సంతోషపడిన ఈ నాయకులూ, కార్యకర్తలూ తరువాత అసలు విషయం తెలుసుకుని సందిగ్ధంలో పడ్డారు. నిధులు విడుదలకు ఆర్థికశాఖ అనుమతి లేకపోవటమే వీరి సందిగ్ధతకు కారణం. ఆర్ధికశాఖ అనుమతి లేకుండా పనులు చేపడితే నష్టపోక తప్పదని వారు భయపడుతున్నారు. ఎన్నికలయ్యే వరకూ వర్క్ ఆర్డర్లను తాయిలంలా చూపించి తరువాత ట్రెజరీ ఆంక్షల పేరిట మొండిచేయి చూపుతారేమోనన్న భయాన్ని కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ద్వారా లబ్ది పొందాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ట్రెజరీ ఆంక్షలు ఇబ్బందికరంగా మారాయి.
http://www.teluguone.com/news/content/srikakulam-district-narasannapeta-24-13621.html





