తెలంగాణకు నైరుతి.. మరో రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే!
Publish Date:Jun 7, 2026
Advertisement
తెలంగాణ ప్రజలు మరో రెండు మూడు రోజులు ఎండ, ఉక్కపోతలను భరించాల్సిందే. ఈ పాటికే రాష్ట్రంలోనికి ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా జాప్యం కానున్నాయి. నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది. ఈశాన్య అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనాలు రుతుపవనాల కదలికకు సానుకూలంగా మారాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ 1 నాటికే రావాల్సిన రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. ప్రస్తుతం ఇవి తీరప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల గుండా ముందుకు సాగుతున్నాయి. రుతుపవనాల ద్రోణి వెంబడి ఏర్పడిన తుపాను ఆవర్తనాల వల్ల అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు ఈశాన్య దిశగా కదులుతున్నాయి. దీంతో మధ్య భారతదేశంపై మేఘాలు దట్టంగా కమ్ముకుని వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11వ తేదీ నాటికి ఈ వ్యవస్థ మరింత బలపడి, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ ( వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/southwest-monsoon-to-telangana-36-222190.html





