కుంభమేళాను తలదన్నేలా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు.!
Publish Date:Aug 11, 2026
Advertisement
గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పవిత్ర ఘట్టాన్ని నభూతో అన్న చందంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుసంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. దక్షిణ భారత కుంభమేలాగా భావించే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సారి పుష్కారాలకు పది కోట్ల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకుఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కుంభమేలా ఏర్పాట్లను తలదన్నేలా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణకు చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఇప్పటికే చర్యలు ప్రారంభించి పకడ్బందీగా ముందుకు సాగుతోంది. పుష్కరాల నిర్వహణ నభూతో అన్నట్లుగా నిర్వహించడంతో పాటు.. రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఇతర తీర ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. శాశ్వత మౌలిక వసతుల కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయల పనులకు పాలనా అనుమతులు మంజూరు చేసింది. పుష్కరాల నిర్వహణలో భాగంగా మున్సిపల్, పర్యాటక, దేవాదాయ, నీటిపారుదల శాఖలు సమన్యయంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాయి. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 150 కోట్ల నిధులలో సింహభాగం అంటే వంద కోట్ల రూపాయలు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు, కొవ్వూరు మున్సిపాలిటీకి 20 కోట్లు, నర్సాపురం మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. ఇంకా నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక నిధులను కేటాయించింది. ఈ నిధులతో రోడ్ల వెడల్పు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ, విద్యుద్దీపాల ఏర్పాటు పనులను చేపడతారు. గోదావరి తీరం పొడవునా కొత్తగా పుష్కర ఘాట్లను నిర్మించడంతో పాటు, గతంలో ఉన్న ఘాట్లకు సమగ్ర మరమ్మతులు చేపట్టనున్నారు. పుష్కర ఘాట్ల వద్ద తొక్కిసలాటలు జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండాఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ల వద్ద నిరంతర నీటి శుద్ధి, మహిళలకు బట్టలు మార్చుకునే ప్రత్యేక గదులు, అత్యవసర వైద్య శిబిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. గోదావరి తీరంలో తాత్కాలికంగా సువిశాలమైన టెంట్ సిటీలు ఏర్పాటు, హోమ్‌స్టే ఏర్పాట్లు చేయడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. రాజమహేంద్రవరం నుంచి గోదవరి నదిపై పాపికొండల విహారయాత్ర, బోటింగ్ సదుపాయాలను భద్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం సర్కార్ అధికా రులను ఆదేశించింది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గోదావరి పుష్కరాలు ఈ సారి వచ్చే ఏడాది జూన్ 26 నుండి జులై 7 వరకు జరుగుతాయి. AP government Preparations for Godavari Pushkaralu, Godavari Pushkaralu, AP Government Funds, Rajamahendravaram, Pushkaram Ghats, Infrastructure
http://www.teluguone.com/news/content/ap-government-preparations-for-godavari-pushkaralu-36-228640.html





