పంచాయతీలకు పొత్తు ధర్మం వర్తించదు: జనసైనికులకు పవన్ కల్యాణ్ స్పష్టీకరణ.!
Publish Date:Nov 23, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షలు లేదా పట్టింపులు లేవని, ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేయవచ్చని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరుతో జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది. గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది. ఏ గ్రామంలోనైనా జనసేన మద్దతుతో పోటీ చేయాలనుకునే వారు ముందుకు వచ్చి నామినేషన్ వేయవచ్చని క్లారిటీ ఇచ్చింది. అలా పోటీ చేయాలనుకునే అభ్యర్థులను పార్టీ నాయకులు అడ్డుకోకూడదనీ, వారికి అండగా నిలబడి, సహకారం అందించి, నామినేషన్ వేసేందుకు ప్రోత్సహించాలని పేర్కొంది. వీర మహిళలు, జనసైనికులతో పాటు పార్టీ మద్దతుదారులుగా రంగంలోకి దిగి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎవరైనా స్వేచ్ఛగా పాల్గొనవచ్చని ఆ ప్రకటన విస్పష్టంగా పేర్కొంది. కూటమి పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే గ్రామీణ పంచాయతీ ఎన్నికల విషయంలో అలాంటి సీట్ల పంపకాలు ఏవీ ఉండబోవని జనసేనాని పేరుపై విడుదలైన ఆ ప్రకటన స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక పార్టీ జెండాపై లేదా ఒకే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావని వివరించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ప్రజలు ఎన్నుకునే ఈ స్థానాల ఎన్నికలు కూటమి పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలిపారు. ఈ క్రమంలో పౌరుల స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని, ఎవరైనా స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆ ప్రకటన క్లారిటీ ఇచ్చింది. ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.! మున్ముందు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, పోటీ విషయంలో గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా జనసైనికులు, వీర మహిళలు, నాయకులు ఎలా ముందుకు సాగుతారనేది తదుపరి దశలో స్పష్టమవుతుంది. గ్రామీణ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత పోటీకి అవకాశం కల్పించడం ద్వారా స్థానిక స్థాయిలో ఆశావహులకు అవకాశం లభిస్తుందనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ గ్రామ పంచాయతీల వారీగా పోటీ చిత్రం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు: పంచాయతీ నామినేషన్ల వేళ హింసకు కుట్ర: 66 మంది అరెస్టు.! ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! [Pawan Kalyan, Panchayat elections, Jana SenaStand, Seatsharing, AllianceEthics, TeluguOne]
పంచాయతీ ఎన్ని కలవేళ జనసేన అధినేత తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణ స్థాయిలో పోటీ చేయాలనుకునే కార్యకర్తలు, మద్దతుదారులకు ఇది స్పష్టమైన మార్గదర్శకంగా నిలుస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో క్షేత్రస్థాయిలో నామినేషన్ల ప్రక్రియపై చర్చ మొదలైంది.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-25-237740.html




