పసిడి ధరలు పతనం..కొనుగోలుకు ఇదే సరైన సమయమా..కియోసాకి ఏమన్నారంటే..!
Publish Date:Nov 22, 2026
Advertisement
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ధరలు మరింత తగ్గుతాయా లేక ఇదే సరైన కొనుగోలు సమయమా అన్న సందేహాల మధ్య ప్రముఖ ఆర్థిక రచయిత, పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల సుమారు 9 శాతం మేర పడిపోయి 14 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,543.19 డాలర్ల స్థాయికి దిగిరాగా, భారత ఎంసీఎక్స్ మార్కెట్లోనూ పసిడి ఫ్యూచర్స్ భారీగా తగ్గి 10 గ్రాములకు రూ. 1,22,430 వద్ద కదలాడాయి. వెండి ధరలు కూడా భారీగా పతనమై కిలోగ్రాముకు రూ. 1,48,466 స్థాయికి చేరాయి. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన గరిష్ట స్థాయిలతో పోలిస్తే బంగారం ధరలు గణనీయంగా వెనక్కి తగ్గడం సాధారణ ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధరల పతనంపై రాబర్ట్ కియోసాకి భిన్న కోణంలో స్పందించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంకింగ్ వ్యవస్థ, బాండ్ మార్కెట్లలోని లోపాలు అలాగే పెరుగుతున్న అమెరికా రుణభారం దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఇది కూడ చదవండి: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.! మార్కెట్ కుదుపుల సమయంలో బలహీనంగా ఉన్న మదుపరులు భయంతో అమ్ముతుంటే, దీర్ఘకాల దృష్టి ఉన్నవారు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.అదే సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా కియోసాకి హెచ్చరించారు. "పడుతున్న కత్తిని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు" అనే సామెతను గుర్తుచేస్తూ, ధరల పతనం పూర్తిగా ఆగే వరకు వేచి చూడటం లేదా దశలవారీగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు, గోల్డ్ ఈటీఎఫ్‌లు పసిడి నిల్వలను పెంచుకోవడం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తోందని నివేదికలు చెబుతున్నాయి. మున్ముందు ద్రవ్యోల్బణ గణాంకాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతల ఆధారంగా బంగారం ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. దీంతో చిన్న పెట్టుబడిదారులు, పసిడి ప్రియులు ఒక్కసారిగా కాకుండా తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: బంగారం ధరలు భారీ తగ్గుదల.. ప్రధాని మోదీకి సీటీఐ కృతజ్ఞతలు.! మీకు నచ్చవచ్చు: జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.! [ Robert Kiyosaki, Gold Price Crash, Gold Price Today, Gold Rate, Silver Price, Gold Investment, Gold Market, MCX Gold, International Gold Prices, Gold ETF, US Federal Reserve ]
http://www.teluguone.com/news/content/robert-kiyosaki-25-237696.html




