సోలార్ గ్రామంగా నారావారిపల్లె!
Publish Date:May 28, 2026
Advertisement
దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బిల్లుల పెరుగుదల వినియోగదారులకు భారంగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇంటిల్లిపాదిని చల్లబరిచేందుకు వినియోగదారులు ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను వాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. విద్యుత్ వినియోగానికి అనుగుణంగా బిల్లుల్ని చెల్లించాల్సి వుండడంతో వినియోగదారులు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థతో సోలార్ విద్యుత్ వినియోగానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహంపై సోలార్ ప్యానెళ్ళను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులు ఉచితంగా సౌరశక్తిని పొందడంతోపాటు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే వెసులుబాటు లభిస్తోంది. సోలార్ నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్తును వినియోగదారులు గ్రిడ్ కు పంపి, ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఏర్పడింది. సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోదలచిన వినియోగదారులు తొలుత కేంద్ర ప్రభుత్వ ఆధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ పరిశీలించి, ప్రాథమిక అనుమతిని మంజూరు చేసిన తర్వాత వినియోగదారులు ప్రభుత్వ అనుమతి పొందిన సోలార్ ఏజెన్సీల ద్వారా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలను తప్పనిసరిగా పాటించే విధంగా వినియోగదారులు అప్రమత్తంగా వుండాలి. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం సంబంధిత అధికారులు ఇన్స్పెక్షన్ ను పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ వినియోగాన్ని బట్టి సోలార్ ప్యానెల్స్ సామర్థ్యాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది. విద్యుత్ వినియోగం నెలకు 150 యూనిట్ల వరకు వున్నట్లయితే 1 కిలోవాట్టు, 150 నుంచి 300 యూనిట్ల మధ్య వున్నట్లయితే 2 కిలోవాట్లు, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం వున్నట్లయితే 3 లేదా అంతకంటే ఎక్కువ కిలోవాట్ల సామర్థ్యాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది. రెండు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ రోజుకు సుమారుగా 8 నుంచి 10 యూనిట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అవకాశం వుంటుంది. దీనిప్రకారం వాతావరణ పరిస్థితుల ఆధారంగా నెలకు సుమారుగా 200 నుంచి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా ప్రతి గృహం స్వయంచాలక విద్యుత్ ఉత్పత్తిదారుగా మారే సువర్ణ అవకాశం వుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లెలో ప్రతి ఇంటిపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా నారావారిపల్లె సోలార్ గ్రామంగా రూపుదిద్దుకుంది. ఇక కుప్పం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 1,980 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రతి గృహంపై 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 4.36 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదేవిధంగా అక్కడే 98 ఎస్సీ, ఎస్టీయేతర వినియోగదారుల గృహాలపై కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం వున్న 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు ఒక్కో గృహంపై 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 415 యండబ్ల్యుపి సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. సంస్థ పరిధిలో ఇప్పటివరకు 46,049 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా 92.10 యండబ్ల్యుపి సామర్థ్యం గల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అలాగే ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వర్గాల గృహాలపై క్యాపెక్స్ విధానంలో 32,201 రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా 108.86 యండబ్ల్యుపి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.
రూఫ్ టాప్ సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వివిధ బ్యాంకులు వినియోగదారులకు లోన్ మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండడంతో వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గుతోంది. గృహంపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 1.5 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో రూ. 60,000లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు గరిష్ఠంగా రూ. 78,000లను సబ్సీడీ రూపంలో భరిస్తుంది. ఈ సబ్సిడీ ద్వారా వినియోగదారులు తక్కువ పెట్టుబడితోనే విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతోపాటు దీర్ఘకాలిక లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఏర్పడుతోంది.
http://www.teluguone.com/news/content/naravaripalle-as-solar-village-36-221124.html





