బీఆర్ఎస్ పోరు బాట.. లక్షమందితో కేసీఆర్ పాదయాత్ర.!
Publish Date:Sep 7, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలలో ఇంత వరకూ ఒకింత స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం (సెప్టెంబర్ 6) ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీశ్‌రావు సహా పార్టీ ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, సాగునీటి రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అధికార పార్టీ వైఫల్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకించి నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. లక్ష మంది రైతన్నలను కలుపుకుని సాగే బృహత్తర ప్రజా ఉద్యమంలా పాదయాత్ర చేపట్టాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సందర్శనలో భాగంగా ఈ పాదయాత్ర కొనసాగాలని చెప్పారు. రైతుల సంక్షేమం, సాగునీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ చెప్పారు. ఇక అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈభేటీలో చర్చించారు. సభలో ఏయే అంశాలను లేవనెత్తాలి, అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలనే దానిపై ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తనను అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించిన కేసీఆర్.. బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావడం అవసరమా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాగా ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీలో సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుల సంక్షేమ పథకాల అమలులో లోపాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మరోవైపు ప్రజల మధ్య పాదయాత్ర చేపట్టడం ద్వారా రాజకీయ ఒత్తిడిని మరింత పెంచాలన్నారు.
[KCR Fires On CM Revanth Reddy, KCR Padayatra, BRS Party, Kaleshwaram Project, Palamuru Project, Telangana Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/kcr-fires-on-cm-revanth-reddy-24-230845.html





